Robin Utappa vs Virat Kohli | కోహ్లీపై చేసిన కామెంట్స్‌పై ఊతప్ప పశ్చాత్తాపం | ABP Desam
వన్డే వరల్డ్ కప్ 2019లో అంబటి రాయుడు సెలక్ట్ కాకపోవడానికి కారణం విరాట్ కోహ్లీనే అంటూ ఒకప్పుడు విరాట్ కోహ్లీపై ఘాటైన విమర్శలు చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప, ఇప్పుడు సడెన్‌గా తను ఆ రోజు ఇంటర్వ్యూలో అలా మాట్లాడి ఉండకూడదంటూ బాధపడ్డాడు. అంబటి రాయుడి కోసం మాట్లాడి తాను కోహ్లీతో ఉన్న స్నేహాన్ని దెబ్బతీసుకున్నానని అన్నాడు. అసలేం జరిగిందంటే.. 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో అంబటి రాయుడిని భారత జట్టు నుంచి చివరి నిమిషంలో తప్పించి, అతడి స్థానంలో విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడం పెద్ద వివాదంగా మారింది. ఇదే విషయంపై ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాబిన్ ఊతప్ప.. బహిరంగంగానే అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీని విమర్శించాడు. కోహ్లీకి నచ్చకపోతే ఎంత పెద్ద ఆటగాడిని అయినా పక్కనపెట్టేస్తాడని, రాయుడిని చివరి నిమిషంలో తప్పించడానికి కూడా కారణం కోహ్లీనేనని, గతంలో యువరాజ్ సింగ్‌ని కూడా ఫిట్‌నెస్ టెస్ట్‌లతో ఇబ్బంది పెట్టాడంటూ ఊతప్ప షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే ఊతప్ప చేసిన ఈ కామెంట్స్ అప్పట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో అప్పట్లో కోహ్లీ ఫ్యాన్స్ ఊతప్పని విపరీతంగా ట్రోల్ చేశారు.
అయితే రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఊతప్ప.. కోహ్లీ గురించి తను చేసిన వ్యాఖ్యలపై బాధపడ్డాడు. "విరాట్ కోహ్లీ గురించి ఆ రోజు నేను చేసిన వ్యాఖ్యలు నిజమే అయినా, అలా మాట్లాడే ముందు వ్యక్తిగతంగా అతనితో మాట్లాడి ఉండాల్సింది. ఆ వ్యాఖ్యల తర్వాత కోహ్లీతో నా రిలేషన్ బాగా దెబ్బతింది. నాకు మంచి స్నేహితుడైన రాయుడికి ఎదురైన అనుభవం గురించి మాత్రమే చెప్పాను. అలాగే కోహ్లీ కెప్టెన్సీ స్టైల్ ఎలా ఉంటుందో వివరించాను. అంతే కానీ వేరే ఉద్దేశం లేదు. అయితే నేను చేసిన కామెంట్స్ వల్ల చాలా సమస్యలొచ్చాయి. అందుకే ఒకే క్రీడలో ఉన్నప్పుడు ఒకరినొకరు గౌరవించుకోవాలని ఇప్పుడు తెలుసుకున్నాను.’’ అని ఊతప్ప చెప్పుకొచ్చాడు. మరి కోహ్లీపై ఊతప్ప చేసిన కామెంట్స్‌పై మీ ఒపీనియన్ ఏంటి?





















