Veterans again on the field: మాజీలంతా మరోసారి
సెహ్వాగ్ ఓపెనింగ్ దూకుడు, యువీ సిక్సులు, భజ్జీ దూస్రాలు, ఇర్ఫాన్ స్వింగ్ ఓవైపు. జయసూర్య స్టైల్, అక్తర్ జెట్ స్పీడ్, వాస్ విజృంభణ, ముత్తయ్య మాయాజలం మరోవైపు. ఆహా... ఇది కదా సిసలైన క్రికెట్ మజా అంటే. 90ల నాటి దిగ్గజ క్రికెటర్లంతా మళ్లీ ఒకే వేదికపైకి చేరితే...? మామూలుగా ఉండదుగా మరి. ఆనాటి ఆటగాళ్ల చమక్కులను మళ్లీ మనం చూసేందుకు వీలు కల్పిస్తోంది... లెజెండ్స్ లీగ్ క్రికెట్-LLC. ఒమన్ లో జనవరి 20 నుంచి మూడు జట్ల మధ్య ఈ లీగ్ జరగనుంది. ఇండియా మహారాజా జట్టులో వీరూ, యువీ,భజ్జీ, పఠాన్ సోదరులు, ఆర్పీ సింగ్, ఓజా సహా అనేక మంది భారత మాజీ ఆటగాళ్లు ఉన్నారు. రెండో జట్టైన ఆసియా లయన్స్ లో షోయబ్ అక్తర్, అఫ్రిది, జయసూర్య, మురళీధరన్, వాస్, హఫీజ్ సహా అనేక మంది పాక్, శ్రీలంక మాజీ ఆటగాళ్లు ఉన్నారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో మూడో జట్టైన రెస్టాఫ్ ద వరల్డ్ జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ లీగ్ కు భారత పురుషుల జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ మాజీ ఆటగాళ్ల మధ్య పోరు ఫ్యాన్స్ కు వినోదాన్ని అందించడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు.