Vinesh Phogat Julana Election Result | ఎమ్మెల్యేగా నెగ్గిన మల్లయోధురాలు వినేశ్ ఫోగాట్ | ABP Desam
పారిస్ ఒలింపిక్స్ లో తృటిలో గోల్డ్ మిస్సైన మల్లయోధురాలు వినేశ్ ఫోగాట్ రాజకీయ అరంగేట్రంలోనే విజయం సాధించారు. హర్యానా లో జరిగిన ఎన్నికల్లో జులానా నియోజకర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వినేశ్ ఫోగాట్ బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్ పై భారీ విక్టరీ కొట్టేశారు. పారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ కి ముందు 100 గ్రాములు బరువు ఎక్కువ ఉందనే కారణంతో అనర్హత వేటుకు గురైన వినేశ్ ఫోగాట్...న్యాయపోరాటం చేసినా ఫలితం సాధించలేకపోయారు. వెంటనే రెజ్లింగ్ రిటైర్మెంట్ ప్రకటించిన వినేశ్ కాంగ్రెస్ లో చేరి జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇప్పుడు మొదటి సారి పోటీలోనే విజయాన్ని అందుకున్నారు. ఒలింపిక్స్ కంటే ముందు ఏడాదిన్నర పాటు ఆమె రెజ్లింగ్ సమాఖ్య అప్పటి అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై సుదీర్ఘ పోరాటం చేశారు. మహిళా ప్లేయర్లపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ తోటి రెజ్లర్లతో కలిసి ఢిల్లీ రోడ్లపైనే గడిపారు. ఈ సందర్భంగా లాఠీఛార్జీలు, పోలీసుల చేతుల్లో అనేక సార్లు అవమానాలను ఎదుర్కొన్నారు. ఈలోగా ఒలింపిక్స్ రావటం వినేశ్ అర్హత సాధించి అద్భుతమైన ప్రదర్శనలతో ప్రపంచ నెంబర్ 1 ఆటగాళ్లను మట్టికరిపిస్తూ ప్రదర్శన సాగించినా దురదృష్టవశాత్తు అనర్హత వేటు పడటంతో ఒలింపిక్ గోల్డ్ కలను తీర్చుకోలేకపోయారు. అయితే మాత్రం వినేశ్ మల్లయోధురాలిగా మ్యాట్ పైనా...పోరాట యోధురాలిగా ఢిల్లీ రోడ్లపైనా ఆమె సాగించిన పోరాటంతో జులానా ప్రజల మనసు గెల్చుకున్నారు. అందుకే బీజేపీ గెలుపు తథ్యం అనుకున్న ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా సంచలన విజయం సాధించారు వినేశ్ ఫోగాట్