Soubin Shahir Arrest | మంజుమ్మేల్ బాయ్స్ నిర్మాతల అరెస్ట్
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన సినిమా మంజుమ్మేల్ బాయ్స్. మలయాళ సినీ ఇండస్ట్రీలో ఇది ఒక అద్భుతం. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 240 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది. రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా సృష్టించిన ట్రెండ్ అంతా ఇంతా కాదు. అయితే మంజుమ్మేల్ బాయ్స్ సినిమా ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతుంది. అందుకు కారణం ఆ సినిమా నిర్మాతలను పోలీసులు అరెస్టు చేయడం. 'మంజుమ్మేల్ బాయ్స్' సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన నటుడు సౌబిన్ షాహిర్. ఆయనే ఈ సినిమా నిర్మాతలలో ఒకరు కూడా. సౌబిన్ తో పాటు ఇతర నిర్మాతలు బాబు షాహిర్, ష్వాన్ ఆంటోనీలను కేరళలోని మారాడు పోలీసులు అరెస్టు చేశారు.
'మంజుమ్మేల్ బాయ్స్' సినిమాకు ఫైనాన్స్ చేసిన సిరాజ్ వలియతుర .. వీరిపై కేసు పెట్టారు. తన దగ్గర ఏడు కోట్లు తీసుకున్న నిర్మాతలు లాభాలలో 40 శాతం వాటా ఇస్తానని ప్రామిస్ చేశారని, విడుదల తర్వాత తమ మాట నిలుపుకోలేదని సిరాజ్ కంప్లైంట్ చేశారు. దాంతో పోలీసులు నిర్మాతలను అరెస్ట్ చేశారు. అయితే ముందస్తు బయలు ఉండడంతో వాళ్లను వెంటనే విడుదల చేశారు.
నిర్మాతలకు బెయిల్ ఇవ్వకూడదంటూ పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్‌ను కొట్టి వేసింది కేరళ హైకోర్టు. నిర్మాతలను ప్రశ్నించడానికి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు చేసిన విజ్ఞప్తిని సైతం తోసిపుచ్చింది.ఈ కేసుకు సంబందించి 'మంజుమ్మేల్ బాయ్స్' నిర్మాతలు ఇంకా స్పందించలేదు.





















