SIT Report to AP DGP | ఏపీ ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు పూర్తి | ABP Desam
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు, అనంతరం చెలరేగిన హింసపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదికను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ (SIT Chief Vineet Brijlal) అందజేశారు. ఎన్నికల సమయంలో పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. దీనిపై విచారణ చేపట్టాలని వినీత్ బ్రిజ్‌లాల్ ఆధ్వర్యంలో 13 మందితో సిట్ బృందాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే.
అల్లర్లు, హింస చెలరేగిన పల్నాడు, మాచర్ల, తాడిపత్రి, తిరుపతి, మరికొన్ని ప్రాంతాల్లో సిట్ బృందాలు రెండు రోజులపాటు పర్యటించాయి. స్థానికులు, నేతలతో పాటు పోలీసులను విచారించి పలు వివరాలు సేకరించి ప్రాథమిక నివేదిక రూపొందించారు. సోమవారం నాడు ఏపీ డీజీపీ ఆఫీసుకు వెళ్లిన సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదికను డీజీపీకి అందజేశారు.
రాష్ట్రంలో ఎన్నికల సమయంలో హింసపై ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ అందించింది. ఎన్నికల రోజు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక విచారణ బృందం (SIT) గుర్తించింది. అల్లర్లపై ఈసీ ఏర్పాటు చేసిన సిట్ టీమ్ అధికారులు 2 రోజులపాటు విచారణ చేపట్టారు. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ టీమ్ పరిశీలించింది. సోమవారం దర్యాప్తు నివేదిక సమర్పించాల్సి ఉండటంతో.. ఆదివారం అర్ధరాత్రి వరకు సిట్ దర్యాప్తు కొనసాగింది. రెండు రోజులపాటు తాము సేకరించి వివరాలను సిట్ అధికారులు ప్రాథమిక నివేదికను రూపొందించి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి అందించారు.