Chandrababu naidu on Traffic | అధికారం ఇచ్చారని అహంకారం చూపిస్తే వైసీపీకి పట్టిన గతే
పవన్ కళ్యాణ్, తనూ ఇద్దరూ సామాన్యులమే అనీ..పరదాలు వేయటం ట్రాఫిక్ ఆపటం లాంటివి చేయొద్దని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
అధికారంలోకి వచ్చినా తాము సామాన్యులుగానే ఉంటామని.. రాష్ట్రంలో ఏ ఒక్కరి హక్కులకు భంగం వాటిల్లదని ఎన్డీయే కూటమి శానససభాపక్ష నేత చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం ఆయన మాట్లాడారు. మాకు హోదా సేవ కోసం తప్ప పెత్తనం కోసం కాదని అన్నారు. తమకు సేవ చేసేందుకే ప్రజలు తమకు అధికారం ఇచ్చారని పేర్కొన్నారు. పదవి వచ్చిందని విర్రవీగొద్దని.. వినయంగా ఉండాలని.. విధ్వంస, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఎవ్వరూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని.. వారి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని స్పష్టం చేశారు. సీఎం వస్తున్నాడంటే గతంలో మాదిరిగా ట్రాఫిక్ ఆపడం, రోడ్లు మూసేయడం, చెట్లు కొట్టేయడం, పరదాలు కట్టుకోవడం, షాపులు బంద్ చేయడం వంటివి ఇక ఉండవని చెప్పారు. ముఖ్యమంత్రి కూడా మామూలు మనిషేనని.. సాధారణ వ్యక్తిగానే జనంలోకి వస్తానని అన్నారు.