Ganesh Chaturdhi 2021: రాజకీయ సభలకు లేని అడ్డంకులు వినాయక చవితికి ఎందుకు? : డా.కె.లక్ష్మణ్
రాజకీయ సభల నిర్వహణకు లేని అడ్డంకులు వినాయక చవితి పండుగ నిర్వహణకు ఎందుకని బీజేపీ ఓబిసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా..ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. యావత్ ప్రపంచం కరోనా ప్రభావం నుంచి విముక్తి కల్పించాలని ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు.
వ్యాక్సినేషన్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డాలని లక్ష్మణ్ కోరారు. హిందువుల మనోభావాలు కాపాడే విధంగా ప్రభుత్వాలు చర్యలు ఉండాలే తప్పా, హిందువుల పండుగలకు, శుభకార్యాలకు అవరోధాలు సృష్టించడం ఏమాత్రం భావ్యం కాదని ఆయన వ్యతిరేకించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా వినాయక చవితి వేడుకులు జరపరాదని ఆంక్షలు భావ్యం కాదని, రాజకీయ సభల నిర్వహణకు లేని అడ్డంకులు హిందువుల పండుగకు ఆంక్షలు విధించడంపై ప్రభుత్వాలు పునరాలోచించి హిందువులు పండుగలు జరుపుకునేందుకు అనుమతులు ఇవ్వాలని ఆయన కోరారు.