Viral News: 5 పైసలకే అదిరిపోయే బిర్యానీ, హోటల్‌పై భోజనప్రియుల దండయాత్ర !
Viral News: 50 రూపాయలు తక్కువతో బిర్యానీ అమ్మితేనే జనం క్యూ కడుతుంటారు. అలాంటిది ఐదు పైసలకే అదిరిపోయే బిర్యానీ అందిస్తూ.. నోట్లో నీళ్లూరేలా చేస్తున్నారు పలమనేరు హోటల్ యజమానులు.
Viral News: బిర్యానీ పేరు చెబితేనే మన నోరూరుతుంది. బిర్యానీ నచ్చని భోజన ప్రియులు ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి బిర్యానీని కేవలం ఐదంటే ఐదు పైసలకు అందిస్తే ఇంకేం ఎగబడి తింటారు. ఇలాగే ఓ హోటల్ ప్రారంభ ఆఫర్‌గా ప్రకటిస్తే జనాలు ఎగబడి తిన్నారు. ఆ ఆఫర్ కొన్ని షరతులతో విధించినా కూడా అనూహ్య స్పందన రావడంతో ఆ హోటల్ కిటకిటలాడింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇంతకీ ఈ ఆఫర్ ఎక్కడ, ఇంత తక్కువ ధరకు ఎందుకిస్తున్నారు వంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ వాచ్ దిస్ ఐదు పైసలకే బిర్యాని స్టోరీ..!
చిత్తూరు జిల్లా పలమనేరులో మధు ఫ్యామిలీ డాబాను కొత్తగా ప్రారంభించారు. ఈ ఫ్యామిలీ డాబా యాజమాన్యం 5 పైసలకే బిర్యానీ అందిస్తున్నట్లు బంపర్ ఆఫర్ ప్రకటించారు. అది కూడా ఈ ఒక్కరోజు మాత్రమే అని చెప్పడంతో డాబాకు జనం క్యూ కట్టారు. దీంతో పాటు బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ కోడ్ లో వచ్చిన కస్టమర్లకు 50% రాయితీ ఇస్తామని మరో ఆఫర్ కూడా ఇచ్చింది రెస్టారెంట్ యాజమాన్యం. ఇక ఇదే బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ కోడ్ తో.. మూడు రోజుల పాటు 25 శాతం రాయితీ అందిస్తున్నారు నిర్వాహకులు. దీంతో హోటల్ వద్ద ఐదు పైసల కాయిన్ తో క్యూ కడుతున్నారు నగర వాసులు. ఒక్కసారిగా చిన్నాపెద్దా అందరూ ఎగబడడంతో ఆ హోటల్ తాకిడిని తట్టుకోలేకపోయింది. అంత మంది తరలి రావడంతో యాజమాన్యానికి ఏం చేయాలో దిక్కుతోచలేదు. వందలాది మంది తరలి రావడంతో ప్రస్తుతం రెస్టారెంట్ ప్రాంగణం కిక్కిరిసి పోయింది.
అక్క బావ రెస్టారెంట్ అన్ లిమిటెడ్ బిర్యానీ
నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్క్ లైన్లో ఉన్న అక్క బావ రెస్టారెంట్ అన్ లిమిటెడ్ బిర్యానీతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. అయితే ఇక్కడే చిన్న టెక్నిక్ ఉపయోగించారు రెస్టారెంట్ నిర్వాహకులు. 135 రూపాయల స్టార్టప్ ప్యాకేజీలో 3 చికెన్ పీస్ లు, ఒక ఎగ్, అన్ లిమిటెడ్ బిర్యానీ రైస్ ఉంటుంది. 199 రూపాయల స్పెషల్ ప్యాకేజీలో 6 చికెన్ పీస్ లు, ఒక కోడిగుడ్డు అన్ లిమిటెడ్ బిర్యానీ రైస్ వడ్డిస్తారు. ఇక ఇక్కడ మూడో వెరైటీ కూడా ఉందండోయ్.. అదే స్టూడెంట్ ప్యాకేజీ. స్టూడెంట్ స్పెషల్ ప్యాకేజీలో 99 రూపాయలకే బిర్యానీ రైస్, 2 చికెన్ పీస్ లు ఒక కోడి గుడ్డు ఇస్తారు. ఇదీ ఈ హోటల్ స్పెషాలిటీ.
135 రూపాయలకే కోరినంత బిర్యానీ రైస్ ఇస్తున్నారు కదా అని ఆషామాషీగా తీసుకోవద్దు. బిర్యానీ టేస్ట్ ఇక్కడ సూపర్ గా ఉందంటున్నారు కస్టమర్లు. బిర్యానీకి న్యాయం చేయగలిగినవారు వస్తే మాత్రం కచ్చితంగా పైసా వసూల్ అంటున్నారు.
నెల్లూరోళ్లది వెరైటీ స్టైల్
కస్టమర్లను ఆకట్టుకోడానికి ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. అందులో నెల్లూరోళ్లది వెరైటీ స్టైల్. గతంలో ఇదే అక్క బావ రెస్టారెంట్ ప్రత్యేకంగా పానీపూరీ కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంచేది. అప్పుడు కూడా అన్ లిమిటెడ్ పానీ పూరీ పేరుతో ప్రత్యేక స్కీమ్ పెట్టారు. 50 రూపాయలకే అన్ లిమిటెడ్ పానీపూరీ అంటూ నగర వాసులకు సరికొత్త టేస్ట్ చూపించారు. ఇప్పుడు అన్ లిమిటెడ్ పానీపూరీ అంటూ మరో కొత్త స్కీమ్ తో ముందుకొచ్చారు హోటల్ నిర్వాహకులు.