Warangal News: ఎడ్లబండిపై టీచర్‌ను ఊరేగించారు - రిటైరైన ఉపాధ్యాయుడిపై విద్యార్థుల అభిమానం, స్పందించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Telangana News: టీచర్‌పై అభిమానంతో ఆ విద్యార్థులు ఆయన్ను స్వయంగా ఎడ్లబండిపై ఊరేగించారు. స్వయంగా వారే బండి లాగుతూ పూలవర్షం, కోలాటాలు, బతుకమ్మ ఆటలతో రిటైరైన టీచర్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు.
Students Paraded Teacher On Edlabandi In Warangal: విద్యార్థులకు సరైన మార్గం చూపి వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దే గొప్ప వ్యక్తి టీచర్. ఎంతోమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ బోధన, విద్యార్థులపై ప్రేమతో వారి అంతులేని అభిమానాన్ని చూరగొంటున్నారు. ఈ క్రమంలో వారు ఆ స్కూల్ నుంచి బదిలీపై వెళ్తున్న సందర్భంగా అక్కడి విద్యార్థులు 'మమ్మల్ని వదిలి వెళ్లొద్దు సార్' అంటూ కన్నీళ్లతో వారిని ఆపిన ఘటనలు చూశాం. కొందరు మరింత అభిమానంతో ఉపాధ్యాయులకు పాలాభిషేకాలు చేసిన ఘటనలు చూశాం. అయితే, వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థులు రిటైరైన టీచర్‌ను ఏకంగా ఎడ్లబండిపై ఊరేగించారు. స్వయంగా వారే బండి లాగుతూ టీచర్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ దృశ్యాలు వైరల్‌కాగా డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను విద్యార్థులు ఇలా ఊరేగిస్తూ ఇలా తీసుకెళ్లారని.. ఇప్పుడు మళ్లీ విద్యార్థులు ఇలా టీచర్‌ను ఎడ్లబండిపై ఊరేగించడం చూస్తున్నామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
వరంగల్ (Warangal) జిల్లా దుగ్గొండి (Duggondi) మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో జనార్థన్ ఇటీవల హిందీ ఉపాధ్యాయుడిగా పని చేసి పదవీ విరమణ పొందారు. ఈ క్రమంలో విద్యార్థులు ఆయనపై తమకున్న ప్రేమను విభిన్నంగా చాటుకున్నారు. ఆయన్ను ఎడ్లబండిపై కూర్చోబెట్టి స్వయంగా వారే ఆ బండిని లాగుతూ ఊరేగించారు. దారి పొడవునా పూలవర్షం కురిపించారు. కోలాటాలు, బతుకమ్మ ఆటలు ఆడుతూ టీచర్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
వెంకయ్యనాయుడు స్పందన
వరంగల్ జిల్లా దుగ్గొండి ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేసిన శ్రీ జనార్ధన్ గారు శిష్యుల ప్రేమాభిమానాలను విశేషంగా చూరగొనటం ఎంతో సంతోషాన్ని కలిగించింది. పదవీ విరమణ చేసిన శ్రీ జనార్దన్ గారిని, వారి శ్రీమతి జయ గారిని విద్యార్థినీ విద్యార్థులు ఎడ్ల బండి పై ఊరేగించి తమ ప్రేమను,… pic.twitter.com/yJF0pV0KQ3
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) August 1, 2024
ఈ విషయం తెలుసుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సన్నివేశం భారతీయ సంప్రదాయంలోని గురు శిష్య అనుబంధాన్ని గుర్తు చేసిందంటూ పేర్కొన్నారు. విద్యార్థుల ప్రేమాభిమానాల్ని పొందిన టీచర్‌ను ప్రశంసించారు. విద్యార్థులను అభినందించారు.