Sunfish: విజిటర్స్ రాలేదని తిండి తినడం మానేసిన చేప - సిబ్బంది ఏం చేశారో తెలుసా?
Viral News: జపాన్‌లోని ఆక్వేరియంలో ఓ చేప విజిటర్స్ లేక తిండి తినడం మానేసింది. అయితే, సిబ్బంది వినూత్న ఆలోచనలో మళ్లీ హుషారుగా ఈదడం మొదలుపెట్టింది.

Japan Aquarium New Idea To Cheer Up Its Sunfish: ఓ చేప ఒంటరితనం ఫీల్ అయ్యింది. వారి మీద బెంగతో తిండి కూడా మానేసింది. అవును మీరు వింటున్నది నిజమే. అనారోగ్యమని తొలుత సిబ్బంది భావించినా.. అక్వేరియం సిబ్బంది ఆలోచనతో మళ్లీ నార్మల్ అయ్యింది. అదేంటీ చేప ఇలా కూడా చేస్తుందా.? అని ఆశ్చర్యపోతున్నారా.?. జపాన్‌లోని (Japan) షిమోనోసెకి కైక్యోకాన్ ఆక్వేరియంలో ఈ పరిస్థితి కనిపించింది. అక్కడి స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఈ ఆక్వేరియాన్ని పునరుద్ధరణ పనుల కోసం సిబ్బంది మూసివేశారు. దీంతో సందర్శకులు రావడం ఆగిపోయింది. ఈ పరిస్థితి అక్కడున్న ఒకే ఒక్క సన్‌ఫిష్‌కు (Sunfish) నచ్చలేదు. దీంతో ఆహారం తినడం కూడా మానేసింది.
వినూత్న ఐడియాతో..
సన్ ఫిష్ దాని శరీరాన్ని ట్యాంక్‌కేసి రుద్దడం మొదలుపెట్టింది. ఏదైనా అనారోగ్యం కారణంగా తినడం లేదేమోనని తొలుత సిబ్బంది భావించారు. అయితే, సందర్శకులు రాకపోవడం వల్ల ఒంటరితనం ఫీల్ కూడా ఓ కారణమని భావించి ఆ ప్రకారం ఆలోచన చేశారు. సిబ్బంది యూనిఫామ్‌లను ఆక్వేరియం దగ్గర్లో వేలాడదీశారు. బయట మనుషుల కటౌట్ ఏర్పాటు చేశారు. దీంతో చేప మళ్లీ హుషారుగా కనిపించింది. 'చేప అలా ఉండడానికి అసలు కారణం ఏంటో మాకు అర్థం కాలేదు. తిండి తినకపోవడానికి మరేదైనా కారణం ఉంటుందేమోనని ఆలోచించాం. విజిటర్స్ లేక ఒంటరితనంగా ఫీల్ అవుతుందేమోనని సిబ్బంది ఒకరు అన్నారు. అది అసలు కారణం కాదేమో అనిపించింది. కానీ.. ఓసారి చూద్దామని సిబ్బంది యూనిఫామ్‌లను ఆక్వేరియ దగ్గర్లో వేలాడదీశాం. బయట మనుషుల కటౌట్‌లు ఏర్పాటు చేశాం. ఆశ్చర్యకరంగా తర్వాతి రోజు నుంచి సన్ ఫిష్ ప్రవర్తనలో మార్పు కనిపించింది. మళ్లీ హుషారుగా నీటిలో ఈదుతోంది. నిజం చెప్పాలంటే ఇదంతా మాకు నమ్మశక్యంగా లేదు.' అని ఆక్వేరియం నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.





















