Strange Punishment: వృద్ధుడిపై సిబ్బంది నిర్లక్ష్యం - 20 నిమిషాలు నిలబడాలని సీఈవో పనిష్మెంట్
Viral News: ఓ కంపెనీ సీఈవో సిబ్బందికి వినూత్న పనిష్మెంట్ ఇచ్చారు. వృద్ధున్ని లైన్లో నిలబెట్టినందుకు 20 నిమిషాలు నిల్చోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
CEO Strange Punishment To Staff: విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందికి ఓ కంపెనీ సీఈవో వినూత్న పనిష్మెంట్ ఇచ్చారు. ఓ వృద్ధునికి అసౌకర్యం కలిగించినందుకు 20 నిమిషాల పాటు నిల్చొని పని చేయాలని ఆదేశాలిచ్చారు. పాఠశాలల్లో విద్యార్థుల మాదిరిగా వారిని నిల్చోబెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీకి చెందిన కార్యాలయంలో సుమారు 16 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వారివద్దకు వివిధ పనుల మీద నోయిడా ప్రజలు వస్తుంటారు. ఆ అథారిటీకి గతేడాది ఐఏఎస్ అధికారి డాక్టర్ లోకేశ్ సీఈవోగా నియమితులయ్యారు. ఆయన ప్రజలకు ఏమాత్రం అసౌకర్యం కలిగినా సహించరు. మరీ ముఖ్యంగా వృద్ధులను ఎక్కువసేపు నిలబెట్టకుండా చూడాలని చెబుతుంటారు. ఇందుకోసం అక్కడున్న సీసీటీవీ కెమెరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సిబ్బంది పనితీరును గమనిస్తుంటారు.
సిబ్బందికి వినూత్న పనిష్మెంట్
అయితే, సోమవారం ఓ వృద్ధుడు కౌంటర్ వద్ద నిలబడి ఉండడాన్ని కెమెరాలో సీఈవో చూశారు. ఓ మహిళా ఉద్యోగికి ఆయన పనేంటో చూడాలని సూచించారు. ఆ పని చేయడం వీలు కాకుంటే.. ఆ విషయాన్ని సదరు వ్యక్తికి చెప్పేయాలన్నారు. కానీ, 20 నిమిషాల తర్వాత కూడా అదే కౌంటర్ వద్ద వృద్ధుడు నిల్చొని ఉండడాన్ని సీఈవో గమనించారు. దీంతో వెంటనే కార్యాలయం వద్దకు వచ్చి సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, అంతా 20 నిమిషాల పాటు నిల్చోవాలని ఆదేశించారు. సిబ్బంది అలాగే చేయగా ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. సీఈవో చర్యలపై నెటిజన్లు ప్రశంసించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందికి అలానే చేయాలంటూ కామెంట్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సత్వర స్పందనకు ఇలాంటి చర్యలు అవసరమంటూ కామెంట్స్ చేస్తున్నారు.