Ganesh Immersion 2024: గణేష్ నిమజ్జనంలో సీఎం రేవంత్ మనుమడి తీన్మార్ స్టెప్పులు - మురిసిపోయిన ముఖ్యమంత్రి, వైరల్ వీడియో
Hyderabad News: గణేష్ నిమజ్జనం వేడుకల్లో సీఎం రేవంత్ మనుమడు రేయాన్స్ రెడ్డి సందడి చేశారు. డప్పుచప్పుళ్లకు అనుగుణంగా తీన్మార్ స్టెప్పులేయగా.. ఇది చూసి తాత రేవంత్ మురిసిపోయారు.
CM Revanth Grand Son Tinmar Steps In Ganesh Immersion: హైదరాబాద్‌లో (Hyderabad) గణేష్ నిమజ్జనం వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాసంలో గణేష్ నిమజ్జనం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం మనవడు రేయాన్స్ రెడ్డి (Reyansh Reddy) తన తీన్మార్ స్టెప్పులతో సందడి చేశారు. బుడిబుడి అడుగులతో ముద్దు ముద్దుగా డప్పుచప్పుళ్లకు అనుగుణంగా చిన్నారి వేసిన డ్యాన్స్ చూసి.. తాత రేవంత్ మురిసిపోయారు. సీఎం సతీమణి, కూతురు చప్పట్లు కొడుతూ రేయాన్స్‌ను ఉత్సాహపరిచారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అటు, ట్యాంక్ బండ్‌పై నిమజ్జన ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. క్రేన్ డ్రైవర్స్, ఇతర సిబ్బంది అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. మూడు షిఫ్టుల్లో డ్రైవర్స్, సిబ్బందికి విధులు కేటాయించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
మరోవైపు, భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం వేడుకలు కోలాహలంగా సాగుతున్నాయి. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. గణేశునికి హారతి ఇచ్చిన కమిటీ సభ్యులు వేడుకను ప్రారంభించారు. టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా శోభాయాత్ర హుస్సేన్ సాగర్ చేరుకుంటుంది. మంగళవారం మధ్యాహ్నానికి మహాగణపతి నిమజ్జనం పూర్తి చేయనున్నారు. భక్తుల కోలాహలం, జయ జయ ధ్వానాల మధ్య శోభాయాత్ర సాగుతోంది. అటు, బాలాపూర్ గణేశుని శోభాయాత్ర సైతం ప్రారంభమైంది. అంతకు ముందు నిర్వహించిన వేలంలో బాలాపూర్ గణపతి లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. ప్రతి సంవత్సరం కొత్త రికార్డులు సృష్టించుకొని పైపైకి వెళ్తోంది బాలాపూర్ గణేష్ లడ్డూ. గతేడాది 27 లక్షలకు లడ్డూ వేలంలో అమ్మడుపోగా.. ఈసారి కూడా దాసరి కొలను శంకర్‌రెడ్డి రూ.30 లక్షల ఒక వెయ్యికి లడ్డూను సొంతం చేసుకున్నారు.