Jalagam Venkatrao : ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావుతో ప్రమాణం చేయిస్తారా ? బీఆర్ఎస్‌కు కొత్త సమస్య !
జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తారా ?. స్పీకర్‌కు ఫోన్ చేసి తనతో ప్రమాణం చేయించాలని కోరారు జలగం వెంకట్రావు. అయితే స్పీకర్ నిర్ణయంపై స్పష్టత లేదు.
Jalagam Venkatrao : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తప్పుడు అఫిడవిట్ సమర్పించారని హైకోర్టు నిర్ధారించి ఆయనపై అనర్హతా వేటు వేయడమే కాదు ఐదు లక్షల రూపాయల ఫైన్ వేసింది. రెండో స్థానంలో ఉన్న జలగం వెంకట్రావును విజేతగా ప్రకటించింది. దీంతో జలగం వెంకట్రావు.. తీర్పు కాపీతో సచివాలయానికివచ్చారు. కోర్టు తీర్పును బట్టి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలని విజ్ఞప్తి చేశారు.
వనమా వెంకటేశ్వరరావుపై 2019 లో హై కోర్టులో పిటిషన్ వేశానని వాదనలు విన్న కోర్టు తీర్పు ఇచ్చిందని జలగం వెంకట్రావుచెబుతున్నారు. తనను ఎమ్మేల్యేగా కోర్టు పరిగణించింది. వనమా వెంకటేశ్వర రావును డిస్ క్యాలిఫై చేసింని గుర్తు చేశారు. ఇది నైతిక విజయమని.. తీర్పును అమలు చేయాలని సెక్రటరీని కలిశానన్నారు. స్పీకర్ తో ఫోన్ లో మాట్లాడాననని.. చెప్పారు. స్పీకర్ ఎలా స్పందించారో చెప్పలేదు. 2018 ఎన్నికల్లో అనేక కుతంత్రాలు అన్ని చూశామని.. చివరికి తనదే విజయమన్నారు. ఎమ్మేల్యేగా మూడు నెలల్లో కొత్తగూడెం కు ఏం చేయాలో నాకు ఎజెండా ఉందని చెప్పుకొచ్చారు.
జలగం వెంకట్రావు 2014లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి కొత్తగూడెం నుంచి గెలిచారు. 2018లో మాత్రం వనమా వెంకటేశ్వరరావు చేతిలో స్వల్ ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత వనమా బీఆర్ఎస్ చేరడంతో .. జలగం వెంకట్రావుకు ప్రాధాన్యం తగ్గిపోయింది. దీంతో ఆయన యాక్టివ్ గా లేరు. వచ్చే ఎన్నికల్లో పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో కోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని.. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని ఆయన చెబుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ హైకమాండ్ కు ఇబ్బందికర పరిస్థితులే ఎదురు కానున్నాయి.
వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ... రెండో స్థానంలో ఉన్న వారిని విజేతగా ప్రకటించడం అనేది ఉండదని..కావాలంటే ఉపఎన్నికలు నిర్వహించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ గతంలో ఏపీలో ఓ ఎమ్మెల్యే ఇలాగే పదవిని కోల్పోయారు. రెండో స్థానంలో ఉన్న వైసీపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. అప్పట్లో స్పీకర్ గా ఉన్న కోడెల శివప్రసాదరావు ఆ అభ్యర్థితో ప్రమాణం కూడా చేయించారు. ఇప్పుడు తెలంగాణ స్పీకర్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తనతో వెంటనే ప్రమాణం చేయించాలని జలగం వెంకట్రావు పట్టుబడుతున్నారు. అవసరమైతేచీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని కలుస్తానని అంటున్నారు.
జలగంతో ప్రమాణస్వకారం చేయిస్తే వనమా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తారు. లేకపోతే జలగం న్యాయపోరాటం చేస్తారు. పార్టీ పైనా అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బీఆర్ఎస్ హైకమాండ్‌కు ఇబ్బందికరమే.