Weather Latest Update: ఈ జిల్లాలవారికి హెచ్చరిక! నేడు భారీ-అతిభారీ వర్షాలు, పిడుగులూ పడే ఛాన్స్
నేడు (సెప్టెంబరు 30) ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా, మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు.
తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. కొన్ని చోట్ల భారీ వర్ష సూచనతో ఐఎండీ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ప్రస్తుతం కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి కోస్తా, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు మరొక ద్రోణి విస్తరించింది.
ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో పాటుగా కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లోని అనేకచోట్ల గురువారం (సెప్టెంబరు 29) ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో (సెప్టెంబరు 30) కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా, మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు.
ఒకటో తేదీన దక్షిణ కోస్తాలో అనేకచోట్ల, ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, ఇంకా కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెఅంచనా వేశారు. కాగా వాతావరణ పరిస్థితులు కాస్త గందరగోళంగా ఉన్నందున పిడుగులు, భారీ మెరుపులు కూడా సంభవిస్తాయని, ఆ సమయంలో బయట తిరగడం మంచిది కాదని వాతావరణ అధికారులు సూచించారు. చెట్ల కింద అసలు ఉండొద్దని హెచ్చరించారు. తాజాగా రాష్ట్రంలోని పల్నాడులో ధ్వజస్తంభంపై పిడుగు పడింది. పిడుగుపాటుకు ధ్వజస్తంభం రెండుగా చీలింది. జిల్లాలోని వెల్దుర్తి రాచమల్లపాడు సాయిబాబా గుడిలో ఈ ఘటన జరిగింది.
తెలంగాణలో ఇలా (Telangana Weather)
హైదరాబాద్ లో ని వాతావరణ విభాగం వెల్లడించిన వివరాల మేరకు.. తెలంగాణలో నేడు (సెప్టెంబరు 30) కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.
కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షం పడనుండగా, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. అన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు ఉంటాయని తెలిపారు.
Hyderabad Rain Update: హైదరాబాద్‌లో ఇలా
ఇక హైదరాబాద్‌లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షం, ఉరుములు, మెరుపులు ఉండవచ్చు. నగరంలో ఉపరితల గాలులు ఉత్తర దిశ నుంచి పశ్చిమ దివవైపుకు వీస్తాయి. గాలి వేగం గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో ఉంటుందని అంచనా వేశారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) September 29, 2022