Weather Latest Update: ఐఎండీ రెడ్ అలర్ట్స్! నేడు విపరీతంగా దంచికొట్టనున్న వానలు, ఈ జిల్లాల వారు జాగ్రత్త: వాతావరణశాఖ
తెలంగాణలో వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.
‘‘నిన్న దక్షిణ ఒడిశా - పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం ఈరోజు బలహీన పడింది. ఈ రోజు కూడా షీయర్ జోన్ 20°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిమీ నుండి 5.8 కిమీ ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపు వంగి ఉంది. నిన్నటి ఆవర్తనం ఈ రోజు దక్షిణ ఒడిశా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ పరిసరాలలోని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం వద్ద కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిమీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఈ ఆవర్తన ప్రభావంతో, రాగల 24 గంటలలో ఒక అల్పపీడన ప్రదేశం, దక్షిణ ఒడిశా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం & పరిసరాలలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీనం సుమారు జూలై 26న వాయుగుండంగా బలపడే అవకాశం కూడా ఉంది. ఈ వాయుగుండం నెమ్మదిగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్రప్రదేశ్ - దక్షిణ ఒరిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం (జూలై 24) ఓ ప్రకటనలో వెల్లడించారు.
తెలంగాణలో వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. తెలంగాణలోని కొన్ని జిల్లాలలో ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేశారు. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు. రాగల 5 రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు, గాలి వేగం గంటకు 40 నుండి 50 కిమీ వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు.
ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి (జూలై 26) భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈదురు గాలులు గాలి వేగం గంటకు 40-50 కి.మీ.తో వీచే అవకాశం ఉందని తెలిపారు.
ఏపీలో ఇలా
బుధవారం (జూలై 26) నుంచి మూడు రోజులపాటు కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అమరావతిలోని వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి తర్వాత అల్ప పీడనంగా మారే అవకాశం ఉంది.
అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ జిల్లాలో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
రాజమండ్రిలో గోదావరికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఆదివారం (జూలై 23) ఉదయం నుంచి నెమ్మదిగా మరింతగా వరద మట్టం పెరిగింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గేట్లు తెరిచి సోమవారం నాటికి 7,96,836 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. రాత్రి 8 గంటలకు 10.90 అడుగుల నీటి మట్టం నమోదు అవడంతో 8,63,562 క్యూసెక్కులను విడిచిపెట్టారు.
ఏపీ విపత్తు నిర్వహణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. రేపు అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఎల్లుండి భారీవర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. మిగిలిన చోట్ల విస్తారంగా వర్షాలు పడనున్నట్లు వివరించారు. రేపు కృష్ణా జిల్లా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.