(Source: ECI/ABP News/ABP Majha)
Weather Latest Update: తెలంగాణలో నేడు వడగళ్లు, ఏపీలో పిడుగులు - ఈ జిల్లాల వారికి బిగ్ అలర్ట్!
తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట తదితర జిల్లాల్లో వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఈ రోజు ద్రోణి / గాలిలోని అనిచ్చితి దక్షిణ చత్తీస్‌గఢ్ నుండి విదర్భ, తెలంగాణ మరియు ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టంకి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల వచ్చే అవకాశం ఉంది. రాగల ఐదు రోజుల్లో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది.
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో వడగళ్ళ తో పాటు రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు ( గాలి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో) అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. నేడు తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో, ఈదురు గాలులతో (30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో) కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇంకా తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 65 శాతం నమోదైంది.
ఏపీలో ఎండలు ఇలా
ఉభయగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అంబేడ్కర్ తెలిపారు. గుంటూరు , పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు. మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంబేడ్కర్ కోరారు.
పొలంలో పని చేసే రైతులు, కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా చెట్ల కింద ఉండవద్దని కోరారు. చెట్లపైనే పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అంబేడ్కర్ తెలిపారు.
ఢిల్లీలో వాతావరణం ఇలా
గత కొన్ని రోజులుగా ఎండవేడిమితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆదివారం (ఏప్రిల్ 23) ఉపశమనం లభించింది. వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. రాబోయే ఒక వారం పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీని కారణంగా వేడిగాలులు తగ్గుతాయి. అలాంటి పరిస్థితిలో, వేడి నుండి ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, అసోం సహా ఇతర రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన బలమైన గాలులు వచ్చే అవకాశం ఉంది. దీనితో పాటు, ఆదివారం రానున్న వెస్టర్న్ డిస్టర్బెన్స్ కారణంగా వేడి నుండి ఉపశమనం లభిస్తుందని, దీని కారణంగా ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.