Weather Latest Update: రుతుపవనాల రాక తెలంగాణకు ఎప్పుడో చెప్పిన ఐఎండీ, ఏపీలో పరిస్థితి ఇదీ
ప్రస్తుతం దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయువ్య దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి.
ఈ రోజు నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లోని మరికొన్ని భాగాలకు విస్తరించాయి. రాగల 2,3 రోజులలో ద్వీపకల్ప దక్షిణ భారతదేశంలోని మరి కొన్ని భాగాలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం (జూన్ 19) ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయువ్య దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి. దీంతో రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షములు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
ఈ రోజు రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వేడిగాలుల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 21 నుంచి 25 మధ్య నైరుతి తెలంగాణను తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణ అధికారులు అంచనా వేశారు.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 29 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 39.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 28.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 53 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఏపీలో రాయలసీమ ప్రాంతాలు ముఖ్యంగా రత్నగిరి, కొప్పాల్, పుట్టపర్తి, శ్రీహరికోట ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయని, వాటి గమనం చురుగ్గా సాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రుతుపవనాలు చురుగ్గా కదలడానికి అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయని వివరించారు. రాగల రెండు మూడు రోజుల్లో ద్వీపకల్ప దక్షిణ భారతంలోని మరికొన్ని ప్రాంతాలకూ విస్తరించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
నెల్లూరు నగరంలోని పలు భాగాల వైపుగా కొన్ని వర్షాలు విస్తరిస్తున్నాయి. దీని వలన నెల్లూరులో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను చూడగలం. మరో వైపున పల్నాడు జిల్లా పిడుగురాళ్ల - రెంటచింతల వ్యవధిలో వర్షాలు విస్తరిస్తున్నాయి. ఇది మెల్లగా పల్నాడు జిల్లాలోని పశ్చిమ భాగాలు, ప్రకాశం జిల్లాలోని పలు పశ్చిమ భాగాల్లోకి విస్తరించనున్నాయి.