Weather Latest Update: మరో 3 గంటల్లో ఈ జిల్లాల్లో కుండపోతే! ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
ఈ నెల 15 వరకూ తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.
తెలుగు రాష్ట్రాలను వానలు ముంచెత్తుతున్నాయి. కొద్ది రోజులుగా కరవు సీమ అయిన అనంతపురం వరదల్లో చిక్కుకోగా, మిగతా ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కనిపించింది. ఈ నెల 15 వరకూ తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితి
మధ్య బంగాళాఖాతం, కొమరిన్ పరిసరాల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక నుంచి మహారాష్ట్ర మీదుగా మధ్య భారతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు వీస్తున్నాయి. దక్షిణ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం రానున్న రెండు రోజుల్లో బలహీనపడుతుంది. తరువాత ఈ నెల 17 లేదా 18న ఉత్తర అండమాన్ సముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది. ఇది ఉత్తర తమిళనాడు, కోస్తా తీరాల వైపు కదులుతుందని వాతావరణ అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో పరిస్థితి ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం నేడు (అక్టోబరు 14) ఉదయం 6 గంటలకు తెలిపిన వివరాల ప్రకారం.. వచ్చే 3 గంటల్లో ఈ జిల్లాల్లో వర్షం పడుతుందని అంచనా వేశారు. సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములు మెరుపులతో పాటు ఉంటాయని అధికారులు ప్రకటించారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) October 13, 2022
సాధారణ వెదర్ బులెటిన్‌లో వెల్లడించిన వివరాలు ఇవీ..
14, 15 తేదీల్లో మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం పడనుంది. ఉరుములు, మెరుపులు కూడా చాలా జిల్లాల్లో అక్కడక్కడ కనిపించే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) October 13, 2022
రాయలసీమలో అధికంగా వర్షాలు
ఏపీలో రానున్న 24 గంటల్లో రాయలసీమలో ఎక్కువచోట్ల, కోస్తా ఆంధ్రలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో కొద్దిచోట్ల భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. రెండు రోజుల్లో విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ జిల్లా అధికారులను హెచ్చరించింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూర్యకుమారి ఆదేశించారు. విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో వెంటనే కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. వర్షాలతోపాటు భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
‘‘ఉపరితల ఆవర్తనం వల్ల ఈ రోజు (అక్టోబరు 14) తెల్లవారుజాము వరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కొనసీమ, ఎన్.టీ.ఆర్, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ కొద్ది సేపు వర్షాలుంటాయి. నల్లమల అటవీ ప్రాంతం మీదుగా ఏర్పడుతున్న భారీ మేఘాల వల్ల, అలాగే పీడనం బలపడటం వలన మరో రెండు గంటల్లో నంధ్యాల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడనుంది. అలాగే నేడు తెల్లవారిజామున సమయంలో అక్కడక్కడ భారీ వర్షాలు, పిడుగులు ఉంటుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.