Weather Latest Update: నిలకడగా కొనసాగుతున్న ఆవర్తనం - నేడు ఈ ప్రాంతాల్లో స్వల్ప వర్షాలు!
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 4.5 నుండి 5.8 కిలో మీటర్ల మధ్య ఉన్న ఆవర్తనం ఈ రోజు స్థిరంగా కొనసాగుతుందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు శనివారం (ఆగస్టు 13) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ / వాయువ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తూర్పు, ఈశాన్య జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వాయువ్య దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.7 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 75 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అలాగే గాలులు కూడా స్వల్పంగా వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అన్నారు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి చినుకులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో గాలులు గంటకు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వివరించారు. కొన్ని చోట్ల బలమైన గాలులు పలు చోట్ల వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రానున్న కొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఐఎండీ తాజా అప్‌డేట్స్ ప్రకారం.. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ గా ఉండి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశం ఉంటుంది. అయితే ఆగస్టు 13, ఆగస్టు 14 తేదీల్లో ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉత్తరాఖండ్‌లోని ఆరు జిల్లాల్లో వర్షాల కారణంగా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆగస్టు 12 నుంచి 14 వరకు డెహ్రాడూన్‌లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు, వంతెనలు కూడా చాలా దెబ్బతిన్నాయి.
రాజస్థాన్ లో ఆగస్టు 15 తర్వాత వర్షాకాలం
ఆగస్టు 15 తర్వాత రాజస్థాన్‌లో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే కొద్ది రోజులుగా వర్షాకాలానికి బ్రేక్ పడింది. ఆగస్టు 14 వరకు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, ఈ సమయంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 15 తర్వాతే రాష్ట్రంలో కుండపోత వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
భారీ వర్షాల హెచ్చరిక
శనివారం (ఆగస్టు 12) భారీ వర్షాల కారణంగా బిహార్‌లోని 9 జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే 4 రోజుల్లో జార్ఖండ్‌లో వర్షాలు కురిసే అవకాశం లేదు.
ఈ రాష్ట్రాల్లో వర్షాలు
గుజరాత్, మహారాష్ట్రలోని విదర్భ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. బెంగాల్, ఒడిశా, తెలంగాణ, కొంకణ్, గోవా, కోస్టల్ కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.