Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో పొడివాతావరణమే, రాయలసీమలో మాత్రం కాస్త వర్షాలు పడే అవకాశం
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు బుధవారం (ఆగస్టు 9) ఓ ప్రకటనలో తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాక, రాష్ట్రంలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే, ఆగస్టు 15 వరకూ ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేవని తెలిపారు.
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 31.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.2 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 77 శాతంగా నమోదైంది.
AP Weather News: ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అలాగే గాలులు కూడా స్వల్పంగా వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అన్నారు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి చినుకులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో గాలులు గంటకు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వివరించారు. కొన్ని చోట్ల బలమైన గాలులు పలు చోట్ల వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
‘‘బ్రేక్ రుతుపవనాలు మొదలు కావడం, అలాగే ఎల్-నినో ప్రభావం.. రెండిటి ప్రభావం వల్ల రాయలసీమ జిల్లాల్లో స్వల్పంగా ఆగస్టు 9 రాత్రి, అర్ధరాత్రి వర్షాలు పడ్డాయి. ఎప్పుడైనా బ్రేక్ రుతుపవనాలు వస్తే రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయి. కానీ ఈ సారి మాత్రం అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉన్నాయి. ఎందుకంటే ఫసిఫిక్ లో ఉన్న ఎల్-నినో మన భారతదేశం వాతావరణాన్ని ప్రభావితం చేస్తోంది. దీని వలన వర్షాలు పడాల్సిన దానికంటే తక్కువగా ఉంటుంది. నేడు సాయంకాలం సమయంలో రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు ఉంటాయి.
కానీ రాత్రి, అర్ధరాత్రికి వెళ్లేసరికి అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షాలను చూడగలము. అలాగే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోని కొద్ది భాగాలు, రాయలసీమ జిల్లాల్లోని మిగిలిన భాగాల్లో కొన్ని వర్షాలుంటాయే తప్ప విస్తారంగా వర్షాలు ఉండవు. తెల్లవారి నుంచి సాయంకాలం వరకు రాష్ట్రంలోని చాలా భాగాల్లో ఎండాకాలం లాంటి వాతావరణం కొనసాగనుంది.’’అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.