Crime News: ప్రియురాలిని కిడ్నాప్ చేసి దారుణహత్య, 20 ముక్కలుగా నరికి పొలంలో పాతిపెట్టిన యువకుడు
Telangana News | తెలంగాణలో దారుణం జరిగింది. ఓ యువకుడు తన ప్రియురాలిని కిడ్నాప్ చేసి, దారుణంగా హత్య చేశాడు. గోనెసంచిలో చుట్టి పొలంలో పాతిపెట్టాడు.
Bhadradri Kothagudem district | ఖమ్మం: దేశంలో ఇతర రాష్ట్రాల తరహాలో తెలంగాణలో ఓ క్రైమ్ జరిగింది. ముందుగా తన ప్రియురాలిని అతడు కిడ్నాప్ చేశాడు. ఆపై దారుణంగా హత్యచేసి, ఆపై ప్రియురాలి మృతదేహాన్ని 20 ముక్కలుగా నరికి పాతిపెట్టాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెంలో ఈ దారుణం జరిగింది.
ప్రియురాల్ని కిడ్నాప్ చేసి దారుణహత్య
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. స్వాతి అనే 30 ఏళ్ల యువతిని ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేసి, తర్వాత మృతదేహాన్ని 20 ముక్కలుగా నరికి, ఓ గోనె సంచిలో పెట్టి పొలంలో పాతిపెట్టాడు అని పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయన్న వార్త వింటేనే ఒళ్లంతా ఒక్కసారిగా వణుకు పుడుతుంది. అలాంటిది ఖమ్మం జిల్లాల్లో యువతిని, అది కూడా ఆమె ప్రియుడే అత్యంత కిరాతకంగా హత్య చేయడం సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో స్వాతి హత్య హాట్ టాపిక్ కాగా, అసలేం జరిగింది, ఎందుకు హత్య చేశాడనే వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.
స్వాతి, వీరభద్రం ప్రేమించుకున్నారు. ఆఖరికి నేరాల్లోనూ వారిద్దరూ పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో కొన్ని నెలల కిందట ఈ క్రమంలోనే సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ రత్నకుమార్, పార్వతి అనే భార్యభర్తలను మోసం చేశారు. సింగరేణిలో జాబ్ ఇప్పిస్తామని నమ్మించిన వీరభద్రం, స్వాతి.. ఆ దంపతుల వద్ద నుంచి ఏకంగా రూ.16 లక్షలు తీసుకున్నారు. రోజులు, నెలలు గడుస్తున్నా వారికి సింగరేణిలో ఉద్యోగం ఇప్పించలేదు. తాము మోసపోయామని గుర్తించిన రత్నకుమార్, పార్వతీలు తమ వద్ద ఉన్న తీసుకున్న డబ్బులు తిరిగివ్వాలని అడిగారు.
అసలే అప్పులు చేసి తెచ్చిన డబ్బులు కావడంతో ఆ బాధ భరించలేకపోయారు. అప్పులు తిరిగి చెల్లించలేక, ఇటు మోసపోయామని ఆ భార్యాభర్తలు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. రత్నకుమార్, పార్వతి ఆత్మహత్య చేసుకోవడంతో ప్రేమ జంట స్వాతి, వీరభద్రం చేస్తున్న మోసాలు వెలుగులోకి వచ్చాయి. వారి బంధువులు వచ్చి నిలదీయడంతో కుటుంబానికి ఎంతో కొంత మొత్తం తిరిగివ్వాలని స్వాతి భావించింది. తాము చేసిన తప్పు వల్ల ఇద్దరి ప్రాణాలు పోయాయని.. వారి వద్ద తీసుకున్న డబ్బులు తిరిగిద్దామని ప్రియుడు వీరభద్రంతో స్వాతి చర్చించింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో వీరభద్రం తన నిజస్వరూపాన్ని మరోసారి బయటపెట్టాడు.
స్వాతిని లేకుండా చేస్తే తాను ఎవరికీ ఆ రూ.16 లక్షలు తిరిగి ఇవ్వాల్సిన పని లేదనుకున్నాడు. కొన్ని రోజుల కిందట లవర్ స్వాతిని కిడ్నాప్ చేశాడు. ఆమె కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో అసలు విషయాలు బయటకొచ్చాయి. స్వాతిని కిడ్నాప్ చేసిన వీరభద్రం ఆమెను దారుణంగా హత్య చేశాడు. డెడ్ బాడీని 20 ముక్కలుగా నరికిన ప్రియుడు ఓ గోనెసంచిలో కట్టి ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలని పొలంలో పాతిపెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.