Kaktiya Kala Thoranam:కాకతీయ సామాజ్య వైభవానికి ప్రతీక కళాతోరణం
Kakatiya Empire: కాకతీయ సామ్రాజ్య వైభవం, వైభోగానికి చిహ్నంగా కళాతోరణాన్ని నిర్మించారు. వారి పాలనా స్థితిగతులు తెలిసేలా తోరణంపై శిల్పాలు చెక్కించారు
Warangal News: కాకతీయ సామ్రాజ్య వైభవం(Kakatiya Empire), వైభోగానికి ప్రతీక కాకతీయ తోరణం. చూడగానే రాజసం ఉట్టిపడేలా...కాకతీయుల కాలం సంస్కృతి, శిల్పకళా సంపదకు చిహ్నాంగా కాకతీయ తోరణం(Kalatoranam) దర్శనమిస్తుంది. దీన్ని కాకతీయుల కీర్తి తోరణంగా పరిగణిస్తుంటారు. అయితే ఇది కేవలం నాటి శిల్పసంపదకు నిదర్శనమేనని అందరూ భావిస్తారు. కానీ ఈ తోరణం వెనక కాకతీయుల చరిత్రే దాగి ఉంది.
కాకతీయుల వైభవం
ఓరుగల్లు(Warangal) కేంద్రంగా కాకతీయులు సుదీర్ఘకాలంపాటు పాలించారు. రాణీ రుద్రమదేవి(Rudhrama devi) తెగువ, రుద్రమదేవుడి పోరాట స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోయింది. నాడు వారు తవ్వించిన గొలుసుకట్టు చెరువులు, తటాకాలే నేటికీ తెలంగాణలో సాగు, తాగునీటికి ప్రాణాధారాలు. కాకతీయలు తమ వైభవాన్ని ముందు తరాలు గొప్పగా చెప్పుకునేలా శాసనాలు, గుళ్లు, గోపురాలు కట్టించారు. వెయ్యిస్తంభాల గుడితోపాటు కాకతీయ సామ్రాజ్యానికే తలమానికంగా నిలిచే తోరణాన్ని నిర్మించారు. దాదాపు 12 వ శతాబ్దాంలో నిర్మించిన ఈ రాతి తోరణం నేటికీ చెక్కుచెదరకుండా వారి వైభవాన్ని చాటుతోంది.
వరంగల్‌లోని వారి కోట ఆవరణలో ముఖ ద్వారంగా నిర్మంచిన ఈ కాకతీయ తోరణం....కాకతీయుల గొప్పతనాన్ని చాటుతోంది.ఈ కీర్తితోరణంపై కాకతీయుల పాలన వైభవాన్ని చెక్కించారు. కాకతీయ రాజులు శివ భక్తులు కావడంతో పిల్లర్లపై రుద్రాక్ష రూపంలో దండల మాదిరిగా కనిపిస్తాయి. అంతేకాకుండా కాకతీయ సామ్రాజ్యం ఆర్ధిక సంపన్నంగా కొనసారనాడానికి నిదర్శనంగా పిల్లర్లపై భాగంలో కుబేరుని విగ్రహాన్ని చెక్కించారు. మరో విశేషం ఏమిటంటే 4 పిల్లర్ల పైభాగం మధ్యలో ఏడు కలశాలను చెక్కించారు. తోరణానికి ఇరువైపుల గర్జించే సింహాలు ఉన్నాయి. ఇవి కాకతీయుల నాయకత్వానికి గుర్తుగా దర్శనమిస్తాయి. తోరణం పైభాగంలో మొసలి, ఏనుగును పోలిన శిల్పాలు ఉంటాయి ఇవి కాకతీయుల సెక్యూరిటీ వ్యవస్థకు నిదర్శనంగా కనిపిస్తాయి. చివరిలో అందమైన హంసలు కనిపిస్తాయి. ఇవి కాకతీయ సామ్రాజ్యంలో సమానత్వం, రాజ్యంలో అందరూ సమానులే అనే సందేశానికి నిదర్శంగా ఉన్నాయి.
కట్టుదిట్టంగా నిర్మాణం
కాకతీయ తోరణం నిర్మాణం చేపట్టక ముందు మూడున్నర మీటర్ల లోతు వరకు గోతిని తవ్వి అందులో సన్నని ఇసుక వేసి దానిపై రెండు గ్రానైట్ పలకలు కూర్చోబెట్టారు. ఒక్కో గ్రానైటు పలక బరువు 5.43 టన్నులు ఉంటుంది. ఈ గ్రానైట్ పలకల మీద ఒక్కో దాని మీద రెండు రంద్రాలు చేసి అందులో నాలుగు స్తంభాలను నిలబెట్టారు. ఈ ఒక్కో స్తంభం బరువే దాదాపు 30 టన్నుల వరకు ఉంటుంది. కాకతీయుల తోరణాల కింద ఇసుక వేసి వాటి మీద రాతి పలకలను ఏర్పాటు చేశారు. అవి కనిపించకుండా మట్టితో కప్పివేశారు. అందుకే మనకు కేవలం స్తంబాలు మాత్రమే కనిపిస్తాయి తప్ప...వాటి కింద ఉన్న గ్రానైట్ పలకలు కనిపించవు. తోరణం మీద రెండు హంసలు ఎదురెదురుగా ఉంటాయి. ఇది కాకతీయుల పారదర్శక పాలనకు నిదర్శనం. ఒక్కో హంస బరువు ఒక టన్ను వరకు ఉంటుంది. కాకతీయులు అనేక ఆలయాలను నిర్మించారు. ఇందుకు గుర్తుగా తోరణం మీద ఆలయ స్తంభాలను సైతం చెక్కారు.
నాలుగు స్తంభాల మీద ఏర్పాటు చేసిన దిమ్మెల్లో కత్తిలాగా కనిపించే భాగంలో పంటలు సౌభాగ్యానికి ప్రతీకగా ధాన్యపు రాశుల్ని చిత్రీకరించారు. మధ్యలో లతలు, వృక్ష సంపదను చెక్కించారు ఇవి పర్యావరణానికి ప్రతీకగా నిలుస్తాయి.తోరణంలోని నాలుగు స్తంభాలు కదలకుండా నిలబడేలా వాటి మీద మూడు దీర్ఘ చతురస్రాకారాల్లో దిమ్మెల్ని పెట్టారు. రెండింటి మధ్య లింక్ చేశారు. తోరణం నిల్చోవడానికి వీలుగా నాలుగు స్తంభాలు, వాటి మీద ఏర్పాటు చేసిన రాళ్లకు మధ్య లింకులను ఏర్పాటు చేశారు. నాలుగు స్తంభాలపై రంధ్రాలు చేసి వాటిలో పట్టే విధంగా పైనున్న రాయిని మలచి నిలబెట్టారు. తోరణంలోని రాళ్ల మధ్య కాకతీయులు ఎలాంటి సున్నం లాంటి పదార్థాన్ని వాడలేదు. ఒక రాతి దిమ్మె మీద ఒత్తిడి తెస్తూ దాని మీద మరో పెద్ద రాతి దిమ్మెను పెట్టడంలాంటి పద్ధతినే అవలంబించారు. దాని వలనే అవి కదలకుండా చెక్కు చెదరకుండా ఉన్నాయి. కాకతీయ సామ్రాజ్యంపై తుగ్లక్ లు దాడి చేసి వారి కట్టడాలను, ఆలయాలను, శిల్పసంపదను ధ్వంసం చేసిన తోరణాల జోలికి మాత్రం వెళ్లలేదు. ఇవి పటిష్టంగా ఉండటమూ ఒక కారణమని చరిత్రకారులు చెబుతారు.