Warangal News: అధికారుల నిర్లక్ష్యంతో జోరుగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ దందా!
Warangal News: ఉమ్మడి వరంగల్ జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతోంది. అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో అడ్డూ అదుపు లేకుండా దందాలు సాగిస్తున్నారు.
Warangal News: పేద ప్రజల ఆహార భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం వరంగల్ జిల్లాలో పక్కదారి పడుతున్నాయి. పేదల ఆహారం కోసం అందించే రేషన్ బియ్యం అక్రమార్కులకు వ్యాపార వస్తువుగా మారి కాసులు కురిపిస్తున్నాయి. ముఖ్యంగా నేటి రోజుల్లో ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని ప్రజలు ఎక్కువ మంది తినడం లేదు. ఒక అంచనా ప్రకారం లబ్ధిదారుల్లో 60 శాతం మంది రేషన్ బియ్యం తినడం ఎప్పుడో మానేశారు. ప్రభుత్వం అందించే బియ్యం వద్దు అనడం ఎందుకు అని ప్రతి నెల రేషన్ షాప్ కు వెళ్లి రేషన్ తీసుకుంటున్నారు. దానితో లబ్ధిదారుల వద్ద రేషన్ బియ్యం పేరుకుపోతున్నాయి. అదే అక్రమార్కులకు వరంగా మారింది. ఇంట్లో పేరుకుపోయిన రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులు కొనుగోలుదారులకు కిలోకి పది రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారు.
బియ్యం కొంటాం.. రేషన్ బియ్యం..!
జిల్లాలోని వివిధ గ్రామాల్లో తెల్లవారింది మొదలు బియ్యం ఉన్నాయా రేషన్ బియ్యం.. మేము కొంటాం అంటూ ఒక ఆడ, ఒక మగ మనిషి ఇద్దరు ప్రత్యక్షమై గ్రామంలోని ప్రతి ఇల్లు తిరుగుతూ బియ్యం సేకరిస్తున్నారు. ఉదయం సేకరించిన బియ్యాన్ని నమ్మకస్తులైన ఒక ఇంట్లో పెట్టి చీకటి పడిన తర్వాత ద్విచక్ర వాహనంపై వారి ప్రాంతానికి తరలిస్తున్నారు. అలా వివిధ గ్రామాల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని తమ గ్రామాలలో నిలువ ఉంచి అదును చూసి రైస్ మిల్లుకు తరలించి కిలోకు 15 నుండి 17 రూపాయలకు అమ్ముకుంటున్నారు. అక్రమంగా ఇలా కొన్న బియ్యాన్ని రైస్ మిల్లర్లు పక్క రాష్ట్రాలకు తరలించి క్యాష్ చేసుకుంటున్నారు.
రేషన్ షాపుల ముందే అడ్డా..!
రేషన్ బియ్యం అక్రమ కొనుగోలుదారులు ఎలాంటి భయం, బెరుకూ లేకుండా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని బరితెగించి ఏకంగా రేషన్ షాపుల ముందే అడ్డా వేస్తున్నారు. ఆపై లబ్ధిదారులు షాపు నుంచి బియ్యం తీసుకుని బయటకు రాగానే ఇంటిదాకా ఏం తీసుకుపోతావు, ఇక్కడే ఇచ్చెయ్, ఎన్ని కిలోలు, 20 కిలోలా.. ఇదిగో 200 అంటూ లబ్ధిదారులతో మాటలు కలుపుతున్నారు. వారి షాపు ముందే ఇంత జరుగుతున్నా రేషన్ డీలర్లకు తెలియకుండా ఉంటుందా.. రేషన్ డీలర్ల హస్తం లేకుండానే బియ్యం అక్రమ కొనుగోలుదారులు ఇంత బరితెగిస్తున్నారా అని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో రెండు నెలలు రేషన్ డీలర్లు లబ్ధిదారుల నుండి బియ్యం సేకరించి అక్రమ వ్యాపారస్తులకు అమ్ముకొని క్యాష్ చేసుకోగా.. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఆపేసిన సంగతి ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అధికారుల మౌనం పై ప్రజల్లో పలు అనుమానాలు..
గ్రామాల్లో ఇంత బహిరంగంగా అక్రమ వ్యాపారస్తులు రేషన్ బియ్యం కొనుగోలు చేస్తుంటే రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టవలసిన అధికారులు మాత్రం మిన్నుకుండి పోతున్నారు. నెలలో ఒకటి లేదా రెండు బియ్యం అక్రమ వాహనాలను పట్టుకొని సీజ్ చేసి ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. కొంతమందిపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అధికారుల సహకారంతోనే మండలంలో రేషన్ బియ్యం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుందని మరి కొంతమంది ప్రజలు బహిరంగంగానే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి రేషన్ బియ్యం అక్రమ రవాణాదారులపై ఉక్కు పాదం మోపి ఈ దందాకు ముగింపు పలకవలసిన అవసరం ఎంతైనా ఉంది.