Warangal News: రెండు గదులు, నాలుగు కార్యాలయాలు - వరంగల్ సర్కారు బడుల పరిస్థితి ఇది!
Warangal News: వరంగల్ లోని ఓ సర్కారు బడిలో ఉన్నవే రెండు గదులు కాగా.. అందులో ఒకటి గ్రామ పంచాయతీ, మరొకటి అంగన్వాడీ కేంద్రం, ఇంకోటి ప్రధానోపాధ్యాయుడి కార్యాలయం నిర్వహిస్తున్నారు.
Warangal News: బాలల భవిష్యత్తు తరగతి గదుల్లో రూపొందుతుంది అనేది పెద్దలు చెప్పిన మాట. అసలు వరంగల్ జిల్లాలోని ఓ గ్రామంలో రెండు తరగతి గదులు ఉంటే గ్రామ పంచాయతీ కార్యాలయం, అంగన్వాడీ సెంటర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుని కార్యాలయం అక్కడే ఉంది. ఇది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా.. అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు లెండి. హన్మకొండ జిల్లా దామెరా మండలం సర్వపుర్ గ్రామంలో ఉన్న పాఠశాలలో తరగతి గదులు లేక, చదువు చెప్పాల్సిన టీచర్లు లేకపోతే ఛిద్రమైన భవిష్యత్తు, కుంగిపోతున్న బాల్యమే మిగులుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ పక్క పల్లె ప్రగతి, మన ఊరు మనబడి కార్యక్రమం వంటి పలు అభివృద్ధి పనులకు కోట్ల బడ్జెట్ ను అమలు చేస్తూ వస్తున్నారు. కానీ ఈ బడ్జెట్ మారుమూల గ్రామాలకు అందటం లేదని ప్రజలు వాపోతున్నారు. దానికి నిదర్శనం దామెర మండలం సర్వపుర గ్రామమే అని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను ఉన్నత స్థాయిల్లో ఉంచేందుకు అన్ని విధాల వసతులను ఏర్పాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్తున్నా.. ఎలాంటి వసతులు లేక సర్వపురం గ్రామం అనేక సమస్యలను ఎదుర్కుంటోంది. ముఖ్యంగా పిల్లలు చదువుకోవాలన్నా, సర్పంచ్ సమావేశం పెట్టుకోవాలన్నా, అంగన్వాడీ పిల్లలకు అంగన్వాడీ సెంటర్ కావాలన్నా ఒకటే భవనం అందుబాటులో ఉంది. ఒక భవనంలోనే ఇన్ని వసతులు ఏర్పాటు చేసుకొని అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇన్ని సమస్యలు ఎదుర్కుంటున్నా అధికారులు ఏమాత్రం ప్టటించుకోవడం లేదు.
వరంగల్ లోని కొన్ని పాఠశాలలో కనీస సౌకర్యాలు కరువు
కొన్ని స్కూల్స్‌లో విద్యార్ధుల సంఖ్య బాగానే ఉన్నా, టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. జిల్లాలోని బడులు ఈ దుస్థితిలో ఉండడం వల్ల, తమ పిల్లలకు కనీస చదువు కూడా రాదనే భయంతో, తల్లి దండ్రులు వేల రూపాయల ఫీజులు, డొనేషన్స్ కట్టి దూరంగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్‌కు పంపుతున్నారు. మొత్తంగా కొన్నిబడులను పరిశీలించినా, రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఇవి ప్రతిబింబాలుగా ఉన్నాయని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పైగా కొన్ని బడుల ఆవరణలను ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకోవడం కూడా కనిపిస్తోంది. తల్లిదండ్రులతో ప్రభుత్వ పాఠశాల పరిస్థితుల గురించి మాట్లాడితే.. ఆవేదనతో పాటు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్లే, తాము తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నామని, కానీ ఈ పాఠశాలలు ఉన్న పరిస్థితి చూస్తే, పిల్లలకు చదువు వస్తుందన్న భరోసా కలగడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటి కైనా విద్యార్థుల మసస్యలు పట్టించుకొని మంచి విద్యను అందించాలని కోరుతున్నారు. విద్యాశాఖ మంత్రి, సీఎం కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యేలు స్పందించి నూతన పాఠశాల భవనం, పంచాయతీ కార్యాలయం, అంగన్వాడీ కేంద్రాలకు ప్రత్యేకంగా భవనాలను నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు తమ పిల్లలకు ఈ సమస్యలు తప్పవని చెబుతున్నారు.