Warangal Chit Fund: భార్యాభర్తలపై పెట్రోల్ పోసి నిప్పు, సెల్‌ఫోన్ షాప్‌పై కూడా.. దంపతుల నిర్వాకం
చిట్ ఫండ్ ఏజెంట్ తన భార్యతో వచ్చి ఏకంగా దాడికి దిగాడు. పెట్రోలు పోసి దుకాణాన్ని కాలబెట్టారు. అంతటితో ఆగకుండా బాధితులపై కూడా పెట్రోల్ పోసి నిప్పంచారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
వరంగల్‌లో ఓ చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించిన ఆగడాలు దారుణ స్థితికి చేరాయి. ఓ కస్టమర్ చిట్టీ పాడుకున్నా డబ్బులు ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఏజెంట్ల కుటుంబ సభ్యులతో దాడులు చేయిస్తున్నారు. హన్మకొండలోని అచలా చిట్ ఫండ్ అనే కంపెనీలో డబ్బులు కట్టిన రాజు అనే వ్యక్తి తన చిట్టీ ఎత్తుకున్నా కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో అచలా కంపెనీ వద్ద శుక్రవారం ఆందోళనకు దిగాడు. అది మనసులో పెట్టుకున్న చిట్ ఫండ్ ఏజెంట్ తన భార్యతో వచ్చి ఏకంగా దాడికి దిగాడు. పెట్రోలు పోసి దుకాణాన్ని కాలబెట్టారు. అంతటితో ఆగకుండా బాధితులపై కూడా పెట్రోల్ పోసి నిప్పంచారు.
వివరాలివీ..
హనుమకొండ పట్టణంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలసముద్రం ప్రాంతానికి చెందిన పిట్టల రాజు అనే వ్యక్తి కుమార్‌పల్లి కాంగ్రెస్ భవన్ సమీపంలో శ్రీ అనే సెల్‌ఫోన్ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక హంటర్ రోడ్డుకు చెందిన ఏజెంట్ గణేశ్ ద్వారా రిజిస్టర్డ్ చిట్‌ఫండ్ సంస్థలో చిట్ వేశారు. నాలుగు నెలల కిందట దాన్ని పాడగా.. సొమ్ము ఇవ్వలేదు. రెండు రోజుల కిందట ఏజెంట్ ఇంటికి వెళ్లి నిలదీయగా ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.
దీన్ని మనసులో పెట్టుకున్న చిట్ ఫండ్ ఏజెంట్ గణేశ్, తన భార్యను వెంటేసుకొని శుక్రవారం సెల్‌ఫోన్ దుకాణం వద్దకు వచ్చాడు. అక్కడ కొద్దిసేపు వారి మధ్య వాగ్వాదం జరిగింది. కాసేపటికే వారు అప్పటికే తెచ్చుకున్న సంచిలోంచి పెట్రోల్ సీసా తీసి దుకాణంలో చల్లారు. అనంతరం వెంటనే నిప్పు పెట్టారు. ఆకస్మికంగా జరిగిన ఈ పరిణామంతో భయపడిపోయిన బాధితుడు, ఆయన భార్య బయటకు పరుగుతీశారు. కానీ, దుకాణం కాలిపోతుండడంతో మళ్లీ లోనికి వెళ్లి ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వారిపైనా కూడా పెట్రోల్ పోసి, నిప్పుపెట్టి వెళ్లిపోయారు.
మంటలు అంటుకోవడంతో రాజు బయటికి పరుగుతీశారు. స్థానికులు మంటలు ఆర్పి అతణ్ని ఆస్పత్రికి తరలించారు. మంటలను అర్పే ప్రయత్నంలో దగ్గర్లోని పాన్ షాపు యజమాని రంగయ్యకు కూడా గాయాలయ్యాయి. ఆయన మరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అదృష్టవశాత్తూ రాజు భార్యకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు కోర్టులో చుక్కెదురు.. ఇక నేటి నుంచి..