UPSC Civil Services Ranker: సివిల్స్ ర్యాంకర్ శ్రీసాయి ఆశ్రిత్ ను సత్కరించిన వరంగల్ సీపీ రంగనాథ్
UPSC Civil Services Result 2022: సివిల్స్ పరీక్షల్లో 40వ ర్యాంకు సాధించిన శాఖమూరి శ్రీసాయి ఆశ్రిత్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ క్యాంప్ కార్యాలయములో అభినందించారు.
వరంగల్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్స్ పరీక్షల్లో 40వ ర్యాంకు సాధించిన శాఖమూరి శ్రీసాయి ఆశ్రిత్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ క్యాంప్ కార్యాలయములో అభినందించారు. సివిల్స్ పరీక్షలో అత్యుత్తమ ర్యాంక్ సాధించిన శ్రీ సాయి ఆశ్రిత్ వరంగల్ పోలీస్ కమిషనరు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీసాయి ఆశ్రిత్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ షాలువా కప్పి పుష్పాగుచ్చాలను అందజేసి అభినందనలు తెలిపారు.
అనంతరం శ్రీసాయి ఆశ్రిత్ సివిల్స్ పరీక్షలకు చదివిన తీరుతెన్నుల పోలీసు కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో నిరుపేదలకు పక్షాన నిలిచి వారి అభ్యున్నతి కోసం విధి నిర్వహణలో ముందుకు సాగాలని, చిరుప్రాయంలోనే మొదటి ప్రయత్నంలో సివిల్స్ ఉద్యోగాన్ని సాధించడం అభినందనీయం అన్నారు వరంగల్ సీపీ. అలాగే నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ సివిల్స్ ర్యాంకులు సాధించిన జయసింహరెడ్డి, పత్తిపాక సాయికిరణ్, కొట్టే రుత్విక్ సాయి మంద అపూర్వ, కొయ్యడ ప్రవీణ్ కుమార్ల కు వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందనలు తెలిపడంతో పాటు, తమ పిల్లలను సివిల్స్ పరీక్షల్లో ర్యాంకు సాధించడంలో కృషి చేసిన తల్లిదండ్రులకు పోలీస్ కమిషనర్ అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమములో కాజీపేట ఏసిపి శ్రీనివాస్, శ్రీసాయి ఆశ్రిక్ తండ్రి అమర్ పాల్గోన్నారు.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ మే 23న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు ఫలితాలను చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా మొత్తం 933 మంది అభ్యర్థులు యూపీఎస్సీ ఎంపికచేసింది. కేటగిరీలవారీగా జనరల్-345, ఈడబ్ల్యూఎస్-99, ఓబీసీ-263, ఎస్సీ-154, ఎస్టీ-72 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇక సర్వీసులవారీగా చూస్తే.. ఐఏఎస్‌కు 180 మంది, ఐఎఫ్‌ఎస్-38 మంది, ఐపీఎస్-200 మంది, సెంట్రల్ సర్వీసెస్-ఎ-473 మంది, గ్రూప్-బి సర్వీసులకు 131 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
మొదటి 4 ర్యాంకులు అమ్మాయిలవే..
సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో అమ్మాయిలు మరోసారి సత్తాచాటారు. మొదటి నాలుగు ర్యాంకులను అమ్మాయిలే సాధించడం విశేషం. వీరిలో ఇషితా కిశోర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో మెరవగా.. గరిమ లోహియా, ఉమా హారతి ఎన్. స్మృతి మిశ్రా తర్వాతి నాలుగు ర్యాంకుల్లో నిలిచి సత్తాచాటారు.
సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అదరగొట్టారు. వీరిలో జీవీఎస్ పవన్ దత్తా 22 ర్యాంకుతో మెరవగా.. శాఖమూరి శ్రీసాయి అర్షిత్ 40వ ర్యాంకు, ఆవుల సాయికృష్ణ 94వ ర్యాంకు, అనుగు శివమారుతీరెడ్డి 132వ ర్యాంకు, రాళ్లపల్లి వసంతకుమార్ 157వ ర్యాంకు, కమతం మహేశ్ కుమార్ 200వ ర్యాంకు, రావుల జయసింహారెడ్డి 217వ ర్యాంకు, బొల్లం ఉమామహేశ్వర్ రెడ్డి 270వ ర్యాంకు, చల్లా కల్యాణి 285వ ర్యాంకు, పాలువాయి విష్ణువర్దన్ రెడ్డి 292వ ర్యాంకు, గ్రంథె సాయికృష్ణ 293వ ర్యాంకు, వీరగంధం లక్ష్మి సుజిత 311వ ర్యాంకు, ఎన్. చేతనారెడ్డి 346వ ర్యాంకు, శృతి యారగట్టి 362వ ర్యాంకు, యప్పలపల్లి సుష్మిత 384వ ర్యాంకు, సీహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి 426వ ర్యాంకు, బొల్లిపల్లి వినూత్న 462 ర్యాంకులతో సత్తా చాటారు.