TPCC Chief Seethakka: రేవంత్ రెడ్డి తరువాత మంత్రి సీతక్కకు పీసీసీ పగ్గాలు? రేసులో కాంగ్రెస్ హేమాహేమీలు
Telangana PCC Chief | త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవీకాలం ముగియనుంది. తాజాగా మంత్రి సీతక్క పేరు తెర మీదకి వచ్చింది. సీఎం రేవంత్‌కు ఆమె ఆప్తురాలు కావడం ప్లస్ పాయింట్.
Telangana minister Seethakka as TPCC Chief | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ పదవి రోజురోజుకు హాట్ టాపిక్ గా మారుతోంది. పలువురు సీనియర్ నేతలు పదవి కోసం పోటీ పడుతున్నారు. బీసీ, ఎస్సీ సామాజిక వర్గంతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు పిసిసి పగ్గాలను చేపట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు ప్రధానంగా ఓ మహిళా నేత పేరు సైతం వినిపిస్తోంది. రాష్ట్ర గిరిజన, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పేరు పీసీసీ చీఫ్ పదవికి గట్టిగానే వినిపిస్తుంది. మరికొద్ది రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పిసిసి పదవి ముగుస్తుందడంతో పీసీసీ పగ్గాలు చేపట్టేది ఎవరనే చర్చ జోరుగా సాగుతుంది.
పలువురు నేతల మధ్య పోటీ
కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవిగా పీసిసి పదవిని ఆ పార్టీలో చూస్తారు. ఈ పదవి కోసం వివిధ సామాజిక వర్గాల్లోని నేతలు పోటీ పడడం సహజం. అయితే ఈసారి పీసీసీ పదవి బీసీ లేదా ఎస్సీ తోపాటు గిరిజన మహిళ మధ్య పోటీ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. పిసిసి పదవి కోసం బీసీ సామాజిక వర్గం నుండి మధు యాష్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అద్దంకి దయాకర్ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సంపత్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక రెడ్డి సామాజిక వర్గం నుండి అయితే రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న నేతలతో పాటు కీలకంగా ఉన్న నేతల పోటీపడుతున్నారు. మరోవైపు గిరిజన సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర మంత్రి సీతక్క పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. సీతక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలు కావడంతో పాటు సీతక్క పై రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి లేకపోలేదు.
మూడు సామాజిక వర్గాల మధ్యే పోటీ
అయితే పీసీసీ పదవి బీసీ, ఎస్సీ సామాజిక వర్గ నేతలతో పాటు గిరిజన మహిళా మధ్య పోటి ఉంది. రాష్ట్రం, ప్రభుత్వంలో ఉన్న నేతల సామాజిక వర్గం కోణంలో బీసీ లేదా ఎస్సి సామాజిక వర్గం నేతలకు పీసీసీ పదవి దక్కుతుంది. పీసీసీ పదవి, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. పీసీసీ పగ్గాలు సైతం తన అనుచరుల చేతులను ఉండాలనుకుంటే అత్యంత సన్నిహితురాలిగా ఉన్న సీతక్కకు పిసిసి పగ్గాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి తో పాటు రాహుల్ గాంధీ ఆశీస్సులు సైతం సీతక్కకు ఉన్నాయి. దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంట్, వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీతక్క రాహుల్ పిలుపుమేరకు ఆయా రాష్ట్రాల్లో ప్రచారంలో పాల్గొనడం జరిగింది. సీతక్క ఆదివాసి గిరిజన బిడ్డ కావడం కలిసి వచ్చే అంశం. అయితే సీతక్క మంత్రిగా కొనసాగుతూ పీసీసీ అధ్యక్షురాలుగా కొనసాగుతారా లేదా మంత్రి పదవికి నుండి తప్పించి పీసీసీ పగ్గాలు అప్పగిస్తారా అనే చర్చ సైతం సాగుతుంది.
సీఎం రేవంత్ రెడ్డి చేతిలో పీసీసీ ఉండాలనుకుంటే సీతక్కకు పిసిసి పదవి ఖాయమని చెప్పవచ్చు. అయితే రెండు పదవులు ఒకరి చేతిలో ఉండడం కష్టం కాబట్టి పీసీసీ పగ్గాలు సీతక్క కట్టబెట్టి మంత్రి పదవి నుండి తప్పించవచ్చనే రాజకీయ చర్చ జరుగుతుంది. అయితే సీతక్క మాత్రం పీసీసీ రేసులో ఉన్నానని తన అనుచరులతో చెప్పుకోవడం జరుగుతుంది.
ఉమ్మడి వరంగల్ లో ఇద్దరికి న్యాయం.!
అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో ప్రచారం లేకపోలేదు. సీతక్కను పీసీసీ అధ్యక్ష పదవి అప్పగిస్తే మంత్రి పదవికి రాజీనామా చేయించి ఆస్థానంలో వరంగల్ జిల్లాలో కీలకంగా ఉన్న నేతకు ఆ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సీతక్కతో పాటు వరంగల్ జిల్లాకు చెందిన మరోనేత సన్నిహితులు కావడంతో పగ్గాలు సీతక్క కు, మంత్రి పదవి కొత్తగా పార్టీలోకి వచ్చిన మరి సన్నిహిత నేతకు ఇస్తే ఇద్దరికి న్యాయం చేసినట్టు ఉంటుందని రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
రెండు పదవులు అయితేనే ఒకే..?
అయితే సీతక్క మంత్రిగా ఉన్నా, లేకపోయినా నిత్యం జనాల్లో తిరిగే వ్యక్తి. పీసీసీ పగ్గాలు చేపడితే జనాల్లో తిరగడం కష్టం కాబట్టి సీతక్క మంత్రి పదవితో పాటు పిసిసి పగ్గాలు రెండు పదవులు ఉండాలని కోరుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎస్సీ, బీసీ రెండు సామాజిక వర్గాలకు కాదంటే సీతక్కకు పిసిసి పగ్గాలు ఖాయమని చెప్పవచ్చు. ఏది ఏమైనా మరికొన్ని రోజుల్లో తేలనుంది.