Reservations In Telangana: రిజర్వేషన్లపై తీర్మానం చేస్తే, కిషన్ రెడ్డి ఎందుకు మద్దతిచ్చారు : సత్యవతి రాథోడ్
Reservations In Telangana: గిరిజన రిజర్వేషన్ల పెంపు రాష్ట్ర పరిధిలో ఉంటే అదేవిషయాన్ని కేంద్రం అధికారికంగా ఎందుకు చెప్పలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు.
Telangana Minister Satyavathi Rathod: రాష్ట్ర ప్రభుత్వమే గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుకుంటే కేంద్రం అడ్డుపడకుండా బాధ్యత తీసుకుంటానన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నిజంగా గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ రిజర్వేషన్లను రాష్ట్ర పరిధిలో 10శాతం పెంచుకోవచ్చని కేంద్రం నుంచి అధికారికంగా సమాధానం ఇప్పించాలని డిమాండ్ చేశారు. గిరిజన రిజర్వేషన్ల పెంపులో బీజేపీ మరోసారి గిరిజనులను మభ్యపెట్టేవిధంగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు.
గిరిజన రిజర్వేషన్ల పెంపు రాష్ట్ర పరిధిలో ఉంటే అదేవిషయాన్ని కేంద్రం అధికారికంగా ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) చెప్పాలన్నారు. రిజర్వేషన్లను రాష్ట్రం పెంచుకునే అవకాశం ఉంటే రిజర్వేషన్లను 10శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మాణం చేసినప్పుడు బీజేపీ శాసనసభా పక్ష నాయకుడుగా కిషన్ రెడ్డి ఎందుకు మద్దతు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బంజారాల కోసం తెలంగాణ సీఎం కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి నూతన కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ రామచంద్రు నాయక్, అసోసియేట్ అధ్యక్షులు ఆర్. మోహన్ సింగ్, మహిళా అధ్యక్షురాలు సరోజా సింగ్ ఇతర సభ్యులకు చెప్పారు.
ఆలిండియా బంజారా సేవా సంఘం నూతన కమిటీ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. ముఖ్యమంత్రి కేసిఆర్ దాదాపు 81వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్న క్రమంలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను పెంచకపోవడం వల్ల గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. గిరిజన రిజర్వేషన్లను 10 శాతం పెంచాలని రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మాణాన్ని కేంద్రానికి పంపితే ఇన్నేళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు ఓట్ల కోసం బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు. రిజర్వేషన్ల బిల్లు ఆమోదించినప్పుడు బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎస్టీ రిజర్వేషన్లను రాష్ట్రమే పెంచుకోవచ్చు, కేంద్రం అడ్డుకుంటే దానికి నేను బాధ్యత వహిస్తాననడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు.
ఓటు బ్యాంకు రాజకీయాలు..
ఇన్ని రోజులు గిరిజనులను ఓటుబ్యాంకుగా వాడుకున్న కాంగ్రెస్, బీజేపీలు మరోసారి గిరిజనులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్న క్రమంలో గిరిజన రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలంటే కచ్చితంగా కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందన్నారు. ఇది చేయకుండా కేవలం దాటవేత ధోరణితో, గిరిజనులను మభ్యపెట్టే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని సత్యవతి రాథోడ్ అన్నారు. అవకాశ వాద రాజకీయాలకు పాల్పడుతూ, గిరిజనుల్లో బేధాలు కల్పిస్తూ విభజించి, పాలించే రాజకీయాలు చేస్తున్న బీజేపీకి బంజారాలు తగిన బుద్ది చెప్పాలని, ఈ విషయంలో ఆలిండియా బంజారా సేవా సంఘం తన పాత్రను కీలకంగా పోషించాలని కోరారు.
Also Read: April Bank Holidays : ఐదో తేదీ వరకూ బ్యాంక్ వైపు వెళ్లకండి ! ఎందుకంటే ?