(Source: ECI/ABP News/ABP Majha)
SSC Paper Leak: పేపర్ లీక్ చేశాడంటూ డీబార్! - హైకోర్టు అనుమతితో పరీక్షలు రాస్తున్న ఆ టెన్త్ స్టూడెంట్
TS SSC Paper Leak: తెలంగాణలో టెన్త్ క్లాస్ హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో డీబార్ అయిన విద్యార్థి హరీష్ హైకోర్టు అనుమతితో సైన్స్ పరీక్ష రాశాడు.
Telangana SSC Paper Leak: పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో డీబార్ అయిన హరీష్ అనే విద్యార్థి ప్రస్తుతం పరీక్షలు రాస్తున్నాడు. హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ లో ఎంజేపీ విద్యార్థి దండెబోయిన హరీష్ పదో తరగతి చదువుతున్నాడు. హిందీ పరీక్ష పేపర్ ఇతని వద్ద నుంచి తీసుకునే ఫొటోలు తీసుకున్నారు నిందితులు. ఈ విషయం గుర్తించిన అధికారులు ఐదేళ్ల పాటు హరీష్ పరీక్షలు రాసేందుకు వీలు లేకుండా డీబార్ చేశారు. దీనిపై అతడి తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. విద్యాశాఖ అధికారులు విధించిన డీబార్ ను ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పరీక్షలు రాసేందుకు అనుమతిని ఇచ్చింది. దీంతో సోమవారం హరీష్ పరీక్షా కేంద్రానికి రాగా.. గతంలో ఉన్న హాల్ టికెట్ ను ప్రిన్సిపాల్ అందజేశారు. అదే నెంబర్ తోనే లోపలికి పంపించారు. తమ కుమారుడి జీవితం ఏమైపోతుందోనని ఆందోళన చెందిన అతడి తల్లిదండ్రులు... హరీష్ ను పరీక్షలకు మళ్లీ అనుమతించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను పరీక్షలు రాసేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి విద్యార్థి హరీష్ కృతజ్ఞతలు తెలిపాడు.
పేపర్ లీకేజీతో విద్యార్థిపై కఠిన చర్యలు..?
పదో తరగతి హిందీ పేపర్ బయటకు వచ్చిన ఘటనలో హరీష్ ను అధికారులు డిబార్ చేశారు. ఐదు సంవత్సరాల పాటు పరీక్షలు రాయకుండా అతడిని డిబార్ చేశారు. దీనిపై అతని తండ్రి హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు విచారణ జరిపి కీలక తీర్పు వెలువరించింది. విద్యార్థిపై విధించిన డిబార్ ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు అనుమతి ఇచ్చిన పత్రాన్ని అధికారులకు చూపించగా.. సెంటర్ అధికారులు లోపలికి పంపించారు. అయితే హరీష్ ను డిబార్ చేయడంపై రాష్ట్ర బీజేపీ నేతలు మండిపడ్డారు. ఒక వ్యక్తి గోడ దూకేసి హరీష్ వద్ద ఉన్న హిందీ ప్రశ్నాపత్రాన్ని లాగేసుకున్నాడు. దాన్ని ఫొటో తీసుకుని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు. అయితే ఎవరో వ్యక్తి కిటికీ దగ్గరు వచ్చి ప్రశ్నాపత్రం అడిగాడని, ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడని విద్యార్థి హరీష్ తెలిపాడు. బెదిరించడంతోనే తాను అతడికి క్వశ్చన్ పేపర్ ఇచ్చానని చెప్పాడు.
హిందీ పేపర్ లీకైన ఘటనలో తాను ఏ తప్పూ చేయలేదని అధికారులకు చెప్పాడు. తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని, అతడి జీవితాన్ని నాశనం చేయవద్దని అధికారులను తల్లిదండ్రులు వేడుకున్నారు. డీబార్ ఎత్తివేయాలని కోరినా.. అధికారుల నుండి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో చేసేదేమీ లేక హరీష్ తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో హరీష్ పరీక్షలకు హాజరు కావొచ్చని హైకోర్టు శనివారం తీర్పు ఇచ్చింది. దీంతో సోమవారం హరీష్ పరీక్షలు రాయడానికి వచ్చాడు. మళ్లీ పరీక్షా కేంద్రానికి వచ్చి పరీక్షలు రాయడం ఆనందంగా ఉందని హరీష్ చెప్పాడు.
వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ పాఠశాల-1లో సోమవారం ఉదయం తెలుగు ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత రోజే వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీకైంది. ఆ తర్వాత బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్.. మరికొంత మందికి నోటీసులు ఇవ్వడం సంచలం సృష్టించింది. మేజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వడంతో బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి ఇదివరకే విడుదలయ్యారు. పోలీసులు మాత్రం ఈ కేసును సీరియస్ గా తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.