Palakurthi MLA Yashaswini: ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి, పెత్తనం మాత్రం పౌరసత్వం లేని అత్తది! పాలకుర్తిలో వర్గపోరు
Telangana Politics: పాలకుర్తి కాంగ్రెస్ లో వర్గ విభేదాలు హైదరాబాద్‌ను తాకాయి. ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై, ఇంఛార్జ్ ఝాన్సీ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Palakurthi MLA Yashaswini Reddy- పాలకుర్తి: ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఝాన్సీ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో పౌరసత్వం లేని ఝాన్సీ రెడ్డి నియోజకవర్గంలో రాజకీయం చేయడం ఏంటని సొంత పార్టీ నేతలే గాంధీ భవన్ ముందు ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది.
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వారం రోజులుగా వర్గ పోరు కొనసాగుతుంది. వర్గపోరుకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆమె అత్త ఝాన్సీ రెడ్డి (Jhansi Reddy) కారణమంటూ వర్గానికి చెందిన నాయకులు కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. దేవరుప్పుల మండల అధ్యక్షుడిగా ఉన్న పెద్ది కృష్ణ మూర్తిని తొలిగించి నల్ల శ్రీరాములుని అధ్యక్షుడుగా నియమించడం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి (Yashaswini Reddy), నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డిపై వ్యతిరేకతకు కారణమైంది.
పెద్ది కృష్ణమూర్తిని తొలగించడంతో వర్గ విభేదాలు
దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పెద్ది కృష్ణమూర్తిని తొలగించి ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నల్ల శ్రీరాములును నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి అధ్యక్షున్ని చేశారు. ఇక్కడే ఆందోళనకు బీజం పడింది. పార్టీ కోసం, ఎమ్మెల్యే విజయం కోసం పని చేసిన ప్రతి కృష్ణమూర్తిని తొలగించడాన్ని నిరసిస్తూ వారం రోజులుగా పాలకుర్తి నియోజకవర్గంలో ఆందోళన చేస్తున్నారు కృష్ణమూర్తి వర్గీయులు. నాలుగు రోజుల కిందట అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి వచ్చిన నల్ల శ్రీరాములను కృష్ణమూర్తి వర్గీయులు అడ్డుకోవడంతో ఇరుగు వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. మరుసటి రోజు కృష్ణమూర్తిని తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్త బాబు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. దీంతో వారం రోజులుగా నియోజకవర్గంలో కృష్ణమూర్తి వర్గీయులు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు.
హైదరాబాద్‌ను తాకిన పాలకుర్తి కాంగ్రెస్ లొల్లి..
నియోజకవర్గానికి పరిమితమైన ఆందోళనలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చేరాయి. శనివారం హైదరాబాదులోని గాంధీభవన్ ఎదుట పెద్ది కృష్ణమూర్తి వర్గీయులు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు. ఆందోళనతో ఆగకుండా ఝాన్సీ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణ చేశారు. ఇండియాలో కనీసం పౌరసత్వం లేని ఝాన్సీ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గం లో రాజకీయం చేయడం ఏంటని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.
పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని స్వార్ధ రాజకీయాల కోసం పార్టీలోకి వచ్చిన వారిని ఝాన్సీ రెడ్డి ప్రోత్సహిస్తుందని నియోజకవర్గ వ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ది కృష్ణమూర్తి వర్గీయులతో పాటు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డిలపై అసంతృప్తితో ఉన్న నేతలు, కార్యకర్తలు సైతం ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జిల తీరును తప్పుపడుతున్నారు.
Also Read: కేంద్రంలో అధికారం మాదే, ప్రధానిగా మోదీ హ్యాట్రిక్- సీఎం, మాజీ సీఎంలకు ఇచ్చిపడేసిన ఈటల