రేవంత్ రెడ్డి, గండ్ర మధ్య మాటల యుద్ధం- అంబేద్కర్ చౌరాస్తాకు రావాలని సవాల్
భూపాల్‌పల్లిలో పర్యటించిన రేవంత్ రెడ్డి పార్టీ మారిన గండ్ర వెంకటరమణారెడ్డిపై సీరియస్ కామెంట్స్ చేశారు. దీనిపై గండ్ర అదే తీరున స్పందించారు. తనపై రేవంత్ చేసిన చౌకబారు ఆరోపణలకు విలువ లేదన్నారు.
హాత్‌సే హాత్ హీట్ పెంచుతోంది. ఉమ్మడి వరంగల్‌లో పర్యటిస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్థానిక బీఆర్ఎస్ నేతలపై హాట్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీఆర్‌ఎస్ శ్రేణులు ఎదురు దాడి చేస్తున్నాయి. ఫలితంగా పర్యటన జరిగే ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటొంది.
భూపాల్‌పల్లిలో పర్యటించిన రేవంత్ రెడ్డి పార్టీ మారిన గండ్ర వెంకటరమణారెడ్డిపై సీరియస్ కామెంట్స్ చేశారు. దీనిపై గండ్ర అదే తీరున స్పందించారు. తనపై రేవంత్ చేసిన చౌకబారు ఆరోపణలకు విలువ లేదన్నారు. నిరాశలో ఉండే ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. నిన్న(మంగళవారం) జరిగిన ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్తలే బీఆర్‌ఎస్ కార్యకర్తలను కొట్టారని చెప్పారు గండ్ర.
కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నానని కామెంట్ చేశారు గండ్ర. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తొక్కేయాలని ప్రయత్నించారన్నారు. అన్నింటినీ సహించి పార్టీలో కొనసాగానని చెప్పుకొచ్చారు. సేవ చేసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని అందుకే పార్టీని వీడినట్టు వివరించారు. ప్రజాభిప్రాయం మేరకే బీఆర్‌ఎస్‌లో చేరినట్టు తెలిపారు. పదవుల కోసమో ఆస్తుల కోసమే తాను పార్టీ మారలేదని క్లారిటీ ఇచ్చారు గండ్ర. తన భార్య జ్యోతి పదవి కోసమే అధికార పార్టీలోకి వెళ్లారనే ఆరోపణలు ఖండించారు.
రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్ రాజకీయ ప్రస్తానం ఎక్కడ నుంచి మొదలైందో... ఎక్కడికి వచ్చిందో ప్రజలకు తెలుసని దీనిపై ఎక్కువ మాట్లాడబోనన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ను, రాజశేఖర్‌రెడ్డిని, సోనియాగాంధీని తిట్టిన ఆయన అవసరాల కోసం ఇప్పుడు వారిని పొగుడుతున్నారని అన్నారు. రాజకీయ అవసరాల కోసం రేవంత్ పార్టీ మారితే లేని తప్పు తాను ప్రజల కోసం పార్టీ మారితే తప్పేంటని ప్రశ్నించారు.
పరిశ్రమ పెట్టడానికి న్యాయబద్ధంగా కొన్న స్థలంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కబ్జాలకు పాల్పడి ఉంటే యంత్రాంగానికి ఫిర్యాదు చేయాలే తప్ప ఆరోపణలు చేయడం వల్ల ప్రయోజనం ఏంటని నిలదీశారు. రేవంత్ చేసిన కబ్జా ఆరోపణలు చర్చకు సిద్ధమని గండ్ర ప్రకటించారు. తాను రేపు(గురువారం) ఉదయం 11 గంటలకు అంబేద్కర్ చౌరస్తాకు వస్తానని చెప్పారు. దమ్ముంటే గండ్ర సత్యనారాయణ రావాలని సవాల్ చేశారు.
వరంగల్ జిల్లా భూపాలపల్లిలో మంగళవారం రాత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడుతుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా రేవంత్ రెడ్డి వైపు దూసుకొచ్చారు. కాంగ్రెస్ సభవైపు రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని దగ్గర్లోని థియేటర్ లో బంధించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్న థియేటర్ పై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో థియేటర్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఉద్రిక్తతల మధ్య రేవంత్ రెడ్డి ప్రసంగం ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
"మా కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. మందుకు అమ్ముడుపోయిన వాళ్లు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడిచేస్తున్నారు. మీకు దమ్ముంటే, మీకు చేతనైనా నువ్వు రా బిడ్డా, ఎవరినో పంపించి ఇక్కడ వేషాలు వేస్తున్నారు. నేను అనుకుంటే మీ థియేటర్ కాదు, మీ ఇళ్లు కూడా ఉండదు" అని రేవంత్ రెడ్డి స్థానిక బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.