CNG Station Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లాలో మొట్ట మొదటి మేఘా సీఎన్‌జీ ప్రారంభం!
CNG Station Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లాలో మొట్ట మొదటి మేఘా సీఎన్‌జీ స్టేషన్ ను ప్రారంభించారు. జడ్చర్లతో కలిపి మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సీఎంజీ స్టేషన్ల సంఖ్య 60కి చేరింది.
CNG Station Mahabubnagar: మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అనుబంధ మేఘా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంసీజీడీపీఎల్) సీఎన్‌జీ సేవల విస్తరణలో మరో మైలురాయిని అధిగమించింది. జడ్చర్ల శివార్లలో మహబూబ్‌నగర్ జిల్లాలోనే మొట్ట మొదటి సీఎంజీ స్టేషన్ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఎ.వెంకటేశ్వర రెడ్డి చేతుల మీదుగా శనివారం ప్రారంభమైంది. బెంగళూరు - హైదరాబాద్ జాతీయ రహదారి (NH-44)పై జడ్చర్ల టౌన్ శివార్లలో ''హైవే 79 గ్యాస్ స్టేషన్''లో ఇకపై సీఎన్‌జీ అందుబాటులోకి రానుంది. సీఎంజీతో నడిచే కార్లు, ఆటోలు, బస్సులు, ట్రక్కుల కోసం చవకైన, పర్యావరణ అనుకూలమైన సీఎంజీ ఫ్యూయల్ ఇక్కడ 24 గంటలు అందుబాటులో ఉంటుంది.
దేశంలోని 62 జిల్లాల్లోని 22 భౌగోళిక ప్రాంతాలలో - 10 రాష్ట్రాలను కవర్ చేస్తూ ఎంసీజీడీపీఎల్ తన సీజీడీ ప్రాజెక్టులను వినియోగంలోకి తెచ్చింది. మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఒడిశా, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మేఘా గ్యాస్ తన సేవలను విస్తరిస్తోంది. పై రాష్ట్రాల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే 2,300 కిలోమీటర్ల మేర ఎండీపీఈ లైన్, 600 కిలోమీటర్ల స్టీల్ పైప్ లైన్‌లను ఏర్పాటు చేసింది. జడ్చర్లలో ప్రారంభించిన స్టేషన్‌తో ఈ సీఎంజీ స్టేషన్ల సంఖ్య 60కి చేరింది. గృహ అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సరఫరాతో సైతం మేఘా గ్యాస్ విస్తరిస్తూ వస్తోంది. ఇప్పటికే 80 వేల ఇళ్లకు గ్యాస్ సరఫరా సేవలను అందిస్తోంది మేఘా గ్యాస్.
ఈ కార్యక్రమంలో మేఘాగ్యాస్ సీఈవో వెంకటేష్ పాలింపాటి మాట్లాడుతూ.. మేఘా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ 60వ సీఎన్‌జీ స్టేషన్‌ను జడ్చర్ల ''హైవే 79 గ్యాస్ స్టేషన్'' లో ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. ఎంసీజీడీపీఎల్ దక్కించుకున్న 22 ప్రాంతాలలో సీజీడీ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి పది వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 100కి పైగా కొత్త సీఎంజీ స్టేషన్లను నెలకొల్పాలని ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.
పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ మండలి (పీఎన్జీఆర్బీ) ఇటీవల నిర్వహించిన 11వ సీజీడీ బిడ్డింగ్ రౌండ్‌లో మేఘా గ్యాస్ కంపెనీ 15 భౌగోళిక ప్రాంతాలలో గ్యాస్ సరఫరా కాంట్రాక్టు దక్కించుకుంది. ఈ 15లో మొదట సీఎన్‌జీ సరఫరాకు సిద్ధమైన భౌగోళిక ప్రాంతం మహబూబ్‌నగర్ కావడం విశేషం.