Mahabubabad: అత్తాకోడళ్ల మధ్య గొడవ, తల్లిపై మటన్ కత్తితో దాడి చేసిన కొడుకు! అసలు సంగతి తెలిసి అంతా షాక్
ఆత్తకోడళ్ళ మధ్య ఘర్షణకు కారణం తెలిసిన స్థానికులు ముక్కున వేలేసుకున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో అత్తాకోడళ్ల మధ్య గొడవ తల్లీ కొడుకులు కొట్టుకొనే వరకూ వెళ్లింది. అంతటితో ఆగకుండా పట్టలేని ఆగ్రహం పెంచుకున్న కుమారుడు ఏకంగా తల్లిపై ఓ కత్తితో దాడి చేశాడు. మహబూబాబాద్ మండలం వేంనూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్తకోడళ్ళ మధ్య ఘర్షణకు కారణం తెలిసిన స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. అంత చిన్న విషయానికే కత్తులతో దాడి చేసుకొనే వరకూ పరిస్థితి వెళ్లడంపై అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. పోలీసులు సైతం అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు.
మహబూబాబాద్ జిల్లా వేంనూరు గ్రామంలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. అత్త బుజ్జి, కోడలు నందిని, కొడుకు మహేందర్ కలిసి ఉంటున్నారు. అయితే, శుక్రవారం కోడలు వండిన టమాటా కూర బాగలేదు అని కోడలిని ఆత్త బుజ్జి మందలించింది. తనను దూషించడంపై కలత చెంది, చిన్నబుచ్చుకున్న కోడలు నందిని భర్తకు ఫిర్యాదు చేసింది. దీంతో తల్లిపై కోపం పెంచుకున్న కొడుకు తన భార్యను తిడతావా అంటూ కోపంతో మటన్ కత్తితో కొడుకు మహేందర్ తల్లిపై దాడి చేశాడు.
దీంతో తల్లి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే మహబూబాబాద్ ఏరియా హస్పిటల్ కి తరలించారు. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి మహబూబాబాద్ రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్న విషయంపై ఆత్త కోడళ్ళ మధ్య జరిగిన ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. టమాటకూర బాగా వండలేదని అత్త బుజ్జి మందలించడం ఈ ఘటనకు ప్రధానంగా దారి తీసి ఉండదని, అంతకుముందు ఎన్నో రోజుల నుంచి విభేదాలు ఉండడంతో తాజా ఘటనతో అది పెద్ద గొడవకు దారి తీసిందని స్థానికులు చెప్పారు.
కామారెడ్డిలో తల్లిని హత్య చేసిన కొడుకు
కన్నతల్లిని కన్నకొడుకు తీవ్రంగా చితకబాది హతమార్చిన ఘటన కామారెడ్డిలో జరిగింది. తానే ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించి మృతి చెందిందని తెలిసి ఇంటికి తీసుకువచ్చాక.. జరిగిన పెనుగులాటలో ఓ వ్యక్తి కూడా మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేట గ్రామంలో చోటు చేసుకుంది. మృతి చెందిన తల్లి 65 సంవత్సరాల వయసుగల నర్సమ్మ కాగా కొడుకు 45 సంవత్సరాల వయసు గల నర్సారెడ్డిగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచారెడ్డి మండలం భవానిపేట గ్రామానికి చెందిన నర్సారెడ్డి గత మూడు నెలలుగా భార్య లావణ్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో దూరంగా ఉంటూ అయ్యప్ప మాల వేసుకుని తల్లి నర్సమ్మ వద్ద ఉంటున్నాడు. గత రెండు రోజుల క్రితం శబరిమల వెళ్లి వచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం తల్లి నర్సమ్మతో నర్సారెడ్డి గొడవ పడి తీవ్రంగా చితక బాదాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన నర్సమ్మను స్వయంగా నర్సారెడ్డి 108 అంబులెన్స్ లో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తానని నేరుగా భవానిపేట గ్రామంలోని ఇంటికి తీసుకువచ్చాడు. అప్పటికే నర్సమ్మ మృతి చెందింది.
విషయం తెలుసుకున్న భార్య లావణ్య, కొడుకులు దినేష్ రెడ్డి, చంద్ర రెడ్డి ఇదేమిటని తండ్రి నర్సారెడ్డిని ప్రశ్నించారు. ఈ విషయంలో నర్సారెడ్డికి కుమారుల మధ్య ఘర్షణ జరిగింది. దీంట్లో నర్సారెడ్డి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి పరిశీలించారు.