Konda Surekha: టీపీసీసీలో కమిటీల కలకలం, తనను అవమానించారంటూ కొండా సురేఖ రాజీనామా
తమకు అవకాశం దక్కకపోవడంతో నేతలు రాజీనామాల బాట పడుతున్నారు. టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా చేశారు.
వరంగల్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త కమిటీల నియామకం కాక రేపుతోంది. తమకు అవకాశం దక్కకపోవడంతో నేతలు రాజీనామాల బాట పడుతున్నారు. టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా చేశారు. పీసీసీ కమిటీపై అసంతృప్తితో ఆమె రాజీనామా చేశారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తన పేరు లేదని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. తన కంటే జూనియర్లకు స్థానం కల్పించారని ఆమె వ్యాఖ్యానించారు. పీసీసీ కమిటీలో తన పేరు లేకపోవడం అవమానించడమేనని కొండా సురేఖ తెలిపారు.
కొండా సురేఖ వరంగల్ జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా సేవలందించారు. ఉమ్మడి వరంగల్ లో కీలక నాయకురాలిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి గతంలో ఆమె మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కొండా సురేఖ.. టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో ఆమెకు టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో చోటు కల్పించారు. తాజాగా శనివారం కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ కమిటీని ప్రకటించింది. ఈ కమిటీలో తన పేరు లేకపోవడంతో కొండా సురేఖ అసంతృప్తికి గురయ్యారు. పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఆమె రాజీనామా చేశారు.
తాను 1995 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎంపీపీగా, ఎమ్మెల్యేగా 4 సార్లు, ఓసారి మంత్రిగా చేశానని, తన భర్త కొండా మురళీ 1988 నుంచి పాలిటిక్స్ లో ఉన్నారని.. రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో కొండా సురేఖ పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొండా దంపతులకు ప్రత్యేకమైన పేరు ఉంది. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చే పని చేయలేదు. సొంత ఖర్చులతో కూడా నియోజకవర్గాల్లో పనులు చేశాం. కానీ తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తన పేరు లేదని, కనీసం వరంగల్ జిల్లాకు చెందిన ఒక్క నేత పేరు లేకపోవడం మనస్తాపాన్ని కలిగించిందని ఆ లేఖలో రాశారు. జూనియర్ నేతలను సైతం కమిటీలో అవకాశం కల్పించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లను, ఎమ్మెల్యేగా సైతం ఎన్నిక కాని వారిని నామినేట్ చేసిన కమిటీలో తనను కూడా నామినేట్ చేయడం తనను అవమానించినట్లు భావిస్తున్నట్లు తెలిపారు.
వైఎస్సార్ కుటుంబం కోసం మంత్రి పదవి వద్దు అనుకున్న వ్యక్తినన్నారు. దాన్ని బట్టేపదవులు మాకు ముఖ్యం కాదని అర్థం చేసుకోవాలి. నమ్మిన పార్టీ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటానని, కానీ ఈ కమిటీలో మాత్రం కంటిన్యూ కాలేను. కనుక తెలంగాన పీసీసీ మెంబర్‌గా రాజీనామా చేస్తున్నాను. భర్తతో పాటు తాను వరంగల్ ఈస్ట్, పరకాల నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. సామాన్య కార్యకర్తలాగ పార్టీలో కొనసాగుతాం. ఇప్పటివరకూ పార్టీలో నిర్వహించిన పదవులను ఇక్కడ తెలుపుతున్నానంటూ పలు విషయాలను రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో ప్రస్తావించారు.
TPCC New Committiees : తెలంగాణ కాంగ్రెస్ మొత్తం పద్దెనిమిది మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని నియమించారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ ఇంచార్జ్ గా వ్యవహరిస్తారు. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. మొత్తం 22 మంది సభ్యులు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ఉన్నారు. వీరిలో నిన్నటి వరకూ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేదు. దీంతో ఆయనను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పక్కన పెట్టేసినట్లయింది.
మొత్తంగా పీసీసీ కార్యవర్గంలో 24 మంది ఉపాధ్యకుల్ని నియమించారు. జనరల్ సెక్రటరీలుగా ఏకంగా 84 మందికి పదవులు ఇచ్చారు.పెండింగ్‌లో ఉన్న 26 జిల్లాలకు పార్టీ అధ్యక్షుల్ని కూడా ప్రకటించారు. పార్టీ సీనియర్ నేతలు పలువురు పట్టుబట్టి తమ వారికి కిటీల్లో చోటు కల్పించినట్లుగా తెలుస్తోంది.
పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మాణిగం ఠాగూర్ చైర్మన్ కాగా... రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, వీహెచ్, పొన్నాల, ఉత్తమ్, జానా రెడ్డి, జీవన్ రెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర్ రాజ నర్సింహ, రేణుకా చౌదరి, బలరాం నాయక్, మధుయాష్కీ, చిన్నారెడ్డి, శ్రీధర్ బాబు, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. అజారుద్దీన్, అంజన్ కుమార్, జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్నందున వారికి కూడా చోటు లభించింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీతో పాటు టీ పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా ప్రకటించారు. టీ పీసీసీ అధ్యక్షుడు చైర్మన్‌గా మొత్తం నలభై మంది సభ్యులు ఇందులో ఉన్నారు.