Konda Surekha: రంగంలోకి కొండా సురేఖ దంపతులు.. ఆ కార్యక్రమంతోనే జనంలోకి.. చివరి సభకు రాహుల్ హాజరు
దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా అంశంపై కొండా సురేఖ, మురళి దంపతులు సోమవారం ఉదయం టీపీసీసీ వరంగల్ తూర్పు నియోజకవర్గ సమన్వయ కర్త కోటూరి మానవతారాయ్‌తో భేటీ అయ్యారు.
మాజీ మంత్రి కొండా సురేఖ, మురళి దంపతులు ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ నెల 26న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతులు ఇందులో పాల్గొంటారు. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా అంశంపై కొండా సురేఖ, మురళి దంపతులు సోమవారం ఉదయం టీపీసీసీ వరంగల్ తూర్పు నియోజకవర్గ సమన్వయ కర్త కోటూరి మానవతారాయ్‌తో భేటీ అయ్యారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్న 24 డివిజన్లలో దళిత, గిరిజనులతో కలిసి కొండా దంపతులు, సమన్వయ కర్త మానవతారాయ్ రచ్చబండ నిర్వహించనున్నారు.
రచ్చబండ కార్యక్రమాలు ముగిశాక భారీ ర్యాలీతో తరలి వచ్చి ఎమ్మార్వో లేదా ఆర్డీవోకు దళితబందు పథకం ద్వారా తూర్పు నియోజకవర్గంలోని దళిత గిరిజనులందరికి రూ.10 లక్షల రూపాయలు ఇవ్వాలనే డిమాండ్‌తో కొండా దంపతులు, సమన్వయ కర్త మానవతారాయ్ వినతి పత్రం సమర్పించనున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సెప్టెంబరు 17 వరకు దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా కార్యక్రమాలు జరుగుతాయని వారు తెలిపారు. వరంగల్ పార్లమెంటు పరిధిలో తెలంగాణ పీసీసీ తలపెట్టబోయే కార్యక్రమాలతో దండోరా యాత్రలు ముగుస్తాయని మానవతారాయ్ వెల్లడించారు. చివర్లో జరిగే భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ కూడా హాజరవుతారని చెప్పారు. ఆ సభతోనే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమాలు ముగుస్తాయని వరంగల్ తూర్పు నియోజకవర్గ సమన్వయ కర్త కోటూరి మానవతారాయ్ వెల్లడించారు.
Also Read: Hyderabad Murder: చార్మినార్ మధుసూధన్ హత్య కేసులో వీడిన మిస్టరీ.. అసలు విషయం తేల్చేసిన పోలీసులు
సోమవారం మాజీ మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా ప్రతులను కోటూరి మానవతారాయ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మడిపల్లి కృష్ణాగౌడ్, నల్గొండ రమేష్, మధు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, హుజూరాబాద్ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖను దాదాపుగా ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పరిశీలించాక ఆమె పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: Hyderabad Fraud: యూపీఐ పిన్ నెంబరు ఇలా పెట్టుకుంటున్నారా? జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది!