Kavitha vs Konda Surekha: కవిత జాగృతి పెట్టి కోట్లు కలెక్ట్ చేశారు, మళ్లీ ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా : కొండా సురేఖ
టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాబరి పార్టీ పని పూర్తయిందన్నారు. ఇప్పుడు భారత రాబరి పార్టీగా మారి దేశాన్ని మొత్తం దోచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారని సీఎం కేసీఆర్ కుటుంబంపై కొండా సురేఖ ఆరోపణలు చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ విచారణ అనగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జాగృతి గుర్తుకొచ్చిందని, రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక జాగృతిని పట్టించుకోలేదని కొండా సురేఖ ఆరోపించారు. రాష్ట్రాన్ని మీ కుటుంబం మొత్తం దోచుకుందని, ఇక్కడ దోచుకునేది ఏమీ లేదని, అందుకే దోచుకోవడానికి దేశంపై పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీబీఐ కేసుల నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్సీ కవిత మరోసారి జాగృతిని తెరమీదకు తెచ్చారని కొండా సురేఖ విమర్శించారు. అందుకే కవిత జాగృతి మీటింగ్ పెట్టారని, కొన్నేళ్లుగా పట్టించుకోనిది ఇప్పుడే గుర్తొచ్చిందా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పాడ్డాక టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జాగృతి పేరుతో కవిత దేశ, విదేశాల నుంచి కోట్లాది రూపాయాలను దోచుకున్నారని ఆరోపించారు. బతుకమ్మ పేరుతో విదేశాలలో కోట్ల రూపాయాలు వసూలు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ జరుగుతోందని, ఒకవేళ తన అరెస్టుకు దారితీస్తుందని భయంతోనే కవిత జాగృతిని రంగంలోకి దింపారని ఆరోపించారు. తన వెంట జాగృతిని పెట్టుకుని సీబీఐ కేసులు, అరెస్టుల నుంచి తప్పించుకునే ప్రయత్నం కవిత మొదలుపెట్టారని తాజాగా ఓ వీడియో ద్వారా కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మేధావులు మాట్లాడటం లేదు అని, మళ్లీ దేశం కోసం ఏకం కావాలని కవిత పిలుపునిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వేలాది మంది విద్యార్థులు, యువత ఆత్మ బలిదానాలు చేసుకుంటే చివరికి ప్రయోజనం పొందింది, లాభపడ్డది కేవలం సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రమేనని విమర్శించారు. ఈ ప్రాంత విద్యార్థులు, ఎంతో మంది ప్రాణత్యాగాలను చూడలేక సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని కొండా సురేఖ అన్నారు. అలాంటి తెలంగాణను మీ కుటుంబం దోపిడీ దొంగల్లా దోచుకున్నది, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాబరి పార్టీ పని పూర్తయిందన్నారు. ఇప్పుడు భారత రాబరి పార్టీగా మారి దేశాన్ని మొత్తం దోచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారని సీఎం కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు చేశారు.