Jayashankar Bhupalapally : కానిస్టేబుళ్లపై ఎస్సై లైంగిక వేదింపులు- కాళేశ్వరంలో దారుణం
Telangana News: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుళ్లపై ఎస్సై లైంగిక వేదింపులకు పాల్పడ్డాడు. ఫిర్యాదు అందుకున్న ఉన్నతాధికారులు అతనిపై చర్యలు తీసుకున్నట్టు సమాచారం.
Crime News: సమస్య వస్తే పోలీసుల వద్దకు వెళ్తుంటారు ప్రజలు. అలాంటి పోలీసులకే సమస్య వస్తే... అది కూడా తోటి ఖాకీ డ్రెస్ వేసుకున్న వ్యక్తితోనే ఇబ్బంది ఎదురైతే ఆ మనిషి చూసే నరకం అంతా ఇంతా కాదు. అలాంటి ఘటనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరిగింది. అక్కడ ఎస్సై పని చేస్తున్న భవానిసేన్ తనతో కలిసి పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్‌ను వేధించారు.
కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న ఓ మహిళ కానిస్టేబుల్‌పై ఎస్సై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఒకసారి కాదు వరుసగా అత్యాచారం చేసినట్లు సమాచారం. ఎవరికైనా ఈ విషయం చెప్తే తుపాకీతో చంపేస్తానని మహిళా కానిస్టేబుల్‌ని బెదిరించినట్టు తెలిసింది. ఇన్ని రోజులు సమస్యను ఎవరికి చెప్పుకోలేక మిన్నకుండిపోయిన ఆ కానిస్టేబుల్... వేధింపులు ఎక్కువ అయ్యేసరికి నోరు విప్పాల్సి వచ్చింది.
ఎస్సై భవానిసేన్ వేధింపులు భరించలేక ఎస్పీని కలిసి తన గోడును మహిళ కానిస్టేబుల్ చెప్పుకుంది. లేడీ కానిస్టేబుల్ ఫిర్యాదుతో చర్యలకు ఉపక్రమించిన ఉన్నతాధికారులు రహస్యంగా విచారించారు. దీని కోసం ఓ టీంను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌లో మంగళవారం రాత్రి రహస్యంగా విచారణ జరిపారు. ఇప్పటి వరకు ఒక కానిస్టేబుల్‌నే వేధించారని అనుకుంటే విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు డీఎస్పీలు విచారణ చేయగా ముగ్గురు మహిళ కానిస్టేబుళ్లు నోరు విప్పినట్టు సమాచారం. తమను కూడా ఎస్సై భవానిసేన్ వేధించినట్టు వాళ్లు చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం.
స్టేషన్‌లో మహిళ కానిస్టేబుల్ స్టేట్‌మెంట్‌తో ఎస్సై భవానీ సేన్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించారు. అన్నీ నిజమని తేలడంతో ఎస్సై భవానీ సేన్‌పై లైంగిక వేధింపులు, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ఈ విషయం పై పోలీసులు అధికారికంగా ఇంకా వివరాలు చెప్పలేదు.
సర్వీస్ రివాల్వర్ స్వాధీనం
గతంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనూ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో సస్పెన్షన్ వేటు వేసిన ఉన్నతాధికారులు. ఇప్పుడు అదే ఆరోపణలతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడీ ఎస్సై. ఆయన సర్వీస్ రివాల్వర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.