UNESCO World Heritage Site: ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప దేవాలయం: యునెస్కో..
ప్రసిద్ద రామప్ప దేవాలయం.. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది.
రామప్ప రుద్రేశ్వర ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చేసింది. ఏళ్ల నిరీక్షణకు యునెస్కో ముగింపు పలికింది. సర్వాంగసుందరంగా ముస్తాబైన రామప్ప అంతర్జాతీయ పర్యాటక ముఖచిత్రంలో స్థానం సంపాదించింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు కేటాయించి అంతర్జాతీయ స్థాయిలో ఆలయాన్ని అభివృద్ధి చేశారు. చైనాలోని ఫ్యూజులో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ వర్చువల్ భేటీలో రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
చారిత్రక కట్డడాలు, వారసత్వ సంపద క్రీస్తుపూర్వం నుంచి తెలంగాణలో ఎన్నో ఉన్నప్పటికీ…యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో రాష్ట్రం నుంచి ఇప్పటివరకూ ఒక్కటి కూడా లేద. రామప్ప ఆలయం ఆ గుర్తింపు సాధించి కాకతీయ కళా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. 2019లో రామప్ప ఆలయాన్ని సందర్శించిన యునెస్కో ప్రతినిధుల బృందం ఆ ప్రాంత పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కొన్ని ప్రతిపాదనలు చేసింది. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. రామప్ప దేవాలయానికి సమీపంలో రెండు ఆలయాలను రామప్ప దేవాలయ ఆస్తి పరిధిలోకి తీసుకొచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంత పరిరక్షణకు ప్రత్యేక అభివృద్ధి అథారిటీ, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది.
రామప్ప వరంగల్ జిల్లా కేంద్రానికి 70 కి.మీ. దూరంలో (ప్రస్తుత ములుగు జిల్లా) పాలంపేట గ్రామంలో ఉంది. ఈ అపురూప శిల్పాలయాన్ని క్రీ.శ. 1213లో కాకతీయ ప్రభువు గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు కట్టించాడు. ఆలయ సమీపంలో విశాలమైన చెరువు కూడా నిర్మించాడు. రామప్ప ఆలయ గర్భగుడిలో రామలింగేశ్వరుడు దర్శనమిస్తాడు. కానీ ఆ రామలింగేశ్వరుడి పేరుతో ఈ ఆలయానికా పేరు రాలేదు. ఆనాటి పాలకుడైన గణపతిదేవుడి పేరుతోనూ పిలువలేదు.
ఇంత అందమైన ఆలయాన్ని కట్టించిన రేచర్ల రుద్రుడి పేరుతోనూ చెప్పుకోలేదు, తన శిల్పకళతో ఆ ఆలయం అణువణువునూ అపురూపంగా మలిచిన శిల్పాచార్యుడు, స్థపతి అయిన రామప్ప పేరుతో ప్రఖ్యాతిగాంచింది. కాకతీయుల పాలన శిల్ప కళకు స్వర్ణయుగం, అందులోనూ త్రికూటాలయాలు ప్రసిద్ధి చెందాయి. అయితే, రామప్ప గుడి త్రికూటాలయం కాదు. కానీ, ఈ ఆలయానికి మూడు ప్రవేశ ద్వారాలున్నాయి. ఎత్తయిన పీఠంపై నక్షత్ర ఆకారంలో, తూర్పునకు అభిముఖంగా గుడిని నిర్మించారు. ఉత్తర, దక్షిణ దిశల్లోనూ ప్రవేశ ద్వారాలున్నాయి. ఆలయం మధ్యభాగంలో మహామంటపం ఏర్పాటు చేశారు.
క్రీ.శ.1203లో వేయించిన, గణపతిదేవుని కాలం నాటి కొండపర్తి శాసనం.. కాకతీయ శిల్ప నిర్మాణ కౌశలాన్ని ఈ శ్లోకంలో వర్ణించింది…
ప్రాకారోజయతి త్రికూటమ్ అభితస్తల్ తేన నిర్మాపితః
సుశ్లిైష్టెః క్రమశీర్షకై రుపచితో నీలోపలైః కల్పితః
యశ్చా లక్షిత సంధిబంధ కథనాదేకశిలా తక్షకైః
సంతక్ష్యేవ మహీయసీమ్ ఇవ శిలాం యత్నాత్ సముత్తారితః
‘నల్లని రాళ్లను సమానంగా నున్నగా చెక్కి, సన్నిహితంగా కూర్చి నిర్మించిన త్రికూట ప్రాకారం. వైభవంగా విలసిల్లుతూ ఉంది. అతుకుల గీతలు కనిపించకుండా ఏకశిలా నిర్మితంగా భాసించే ఈ ప్రాకారాన్ని మహా ప్రయత్నంతో శిల్పులు నిర్మించారు’ అన్న శ్లోకార్థాన్ని నిజం చేస్తూ కాకతీయుల నిర్మాణ ప్రతిభకు అద్దంపడుతుంది రామప్ప ఆలయం.
రామప్ప ఆలయ గోపురం తేలికైన ఇటుకలతో రూపొందించారు. ఈ ఇటుకలను ప్రత్యేకమైన మట్టితోపాటు అడవి మొక్కల జిగురు, ఊకపొట్టు, మరికొన్ని పదార్థాలు కలిపి తయారు చేశారు. ఈ పదార్థాలన్నీ సరైన మోతాదులో ఉపయోగించి గట్టిదనం ఉంటూనే, తేలికగా ఉండే ఇటుకలను రూపొందించారు. ఇవి నీటిలో తేలుతాయి. శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ ఇటుకల సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉండటం వల్ల అవి నీటిలో తేలుతాయి. కాకతీయ శిల్పులకు మాత్రమే సొంతమైన పరిజ్ఞానమిది.
వరంగల్ కేంద్రంగా వెలువడిన కాకతీయ పత్రికలో పీవీ నరసింహారావు రామప్ప ఆలయంపై ప్రత్యేక కథనాలు రాశారు. 1957లో మూడు రోజులపాటు రామప్ప ఆలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. 1966 ప్రాంతంలో ‘ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’లో ‘రామప్ప – ఏ సింఫనీ ఇన్ స్టోన్’ శీర్షికతో గొప్ప వ్యాసం రాశారు పీవీ. అలా రామప్ప వైభవాన్ని ప్రపంచానికి చాటేందుకు ప్రయత్నించారాయన.
అయితే 2020, 2021 సంవత్సరాలకు ప్రపంచ వ్యాప్తంగా 41 వారసత్వ కట్టడాలు, సహజ వింతలు.. రెండు కలగలిసినవి ఉండగా 2020 సంవత్సరానికి 24 నామినేషన్లు యునెస్కో పరిశీలనలో ఉన్నాయి. వాటిలో మన దేశం నుంచి రామప్ప దేవాలయం మాత్రమే ఉండటం విశేషం. కాకతీయులు నిర్మించిన అద్భుతమైన ఈ గుడికి సంబంధించిన పదకొండు ఫొటోలను యునెస్కో తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. కోవెలకు సంబంధించిన పూర్తి వివరాలు, నామినేట్ కావడానికి గల కారణాలనూ వివరించింది. ఇక 2021 నామినేషన్లలో మన దేశం నుంచి డోలవీర ఆలయం కూడా ఉంది. గతేడాది కొవిడ్ కారణంగా వారసత్వ గుర్తింపు ఇవ్వకపోవడంతో ఈ సారి 2020, 21 రెండు సంవత్సరాలకు ఒకేసారి గుర్తింపు ఇచ్చేందుకు ఈ నెల 16 నుంచి 23 వరకు ఓటింగ్ నిర్వహించింది. మరోవైపు కేంద్ర పర్యాటక శాఖ మంత్రితో పాటు ఇతర అధికారులను కలిసి రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కేంద్రం సానుకూలంగా స్పందించడంతో ఎట్టకేలకు ఆ గుర్తింపు లభించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ వారసత్వ హోదా దక్కించుకున్న ఏకైక కట్టడంగా రామప్ప ఖ్యాతిని గడించింది...
రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించడం పట్ల ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ఈసందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపిన ప్రధాని… కాకతీయ వారసత్వానికి రామప్ప ఆలయం ప్రతీక అని కొనియాడారు. ప్రతిఒక్కరూ రామప్ప ఆలయాన్ని సందర్శించాలన్నారు..
రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు దక్కడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపు కోసం సహకరించిన కేంద్రానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారత్‌కు మద్దతు తెలిపిన యునెస్కో సభ్య దేశాలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప ఆలయానికి గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులను అభినందించారు.