Palakurthi Shadow MLA: అమెరికా పౌరురాలి చేతిలో పాలకుర్తి పెత్తనం- అత్తగారికి ఎమ్మెల్యేగా మిగిలిపోతున్న యశస్విని రెడ్డి- తలలు పట్టుకుంటున్న ప్రజలు!
Palakurthi Shadow MLA: చాలా కాలం క్రితం వచ్చిన తెలుగు సినిమాలో ఎమ్మెల్యేగా పరిచయం చేసుకుంటూ పీఏ గారి ఎమ్మెల్యే అంటూ సరదాగా చెబుతాడు. ఇప్పుడు అలాంటి సీన్ తెలంగాణలోని ఓ నియోజకవర్గంలో కనిపిస్తోంది.

Palakurthi Shadow MLA: ఎమ్మెల్యేకు షాడో ఎమ్మెల్యేగా అత్త కొనసాగుతూ నియోజకవర్గంతోపాటు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఎమ్మెల్యేగా కోడలు కొనసాగుతున్న నిర్ణయాలన్ని అత్తవే. అత్త సలహా, సూచనల మేరకు మాట్లాడాలి, హామీలు ఇవ్వాలి. ఎమ్మెల్యేతో సమానంగా వేదికను పంచుకొని గౌరవ మర్యాదలు కావాలి. ఇంతకీ ఎవరు ఆ షాడో ఎమ్మెల్యే... ఏ నియోజకవర్గం అనుకుంటున్నారా. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం. ఓటమి ఎరుగని నేత ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించిన యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి అత్త ఝాన్సీ రెడ్డే షాడో ఎమ్మెల్యేగా ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలన్న, అధికారులు కలవాలన్న, పతకాల అమలుపై చర్చించాలన్న అత్త ముందు ఉంటారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఒంటెద్దు పోకడతో వెళ్తున్న ఝాన్సీ రెడ్డిపై ప్రజలు, పార్టీ కార్యకర్తలు సైతం ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అధికారిక కార్యక్రమాల్లో సైతం ఎమ్మెల్యేని కాదని అత్త పాల్గొనడంపై ప్రజలు తిరగబడుతున్నారు.
యశస్విని రెడ్డిపై నియోజకవర్గ ప్రజల ఆశలు...
ఎమ్మెల్యేగా గెలిచిన యశస్విని రెడ్డిపై నియోజకవర్గ ప్రజలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అప్పటికే ఎమ్మెల్యే అత్త ఎన్నారై ఝాన్సీరెడ్డి దంపతులు పాలకుర్తి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే ఆశతో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనుకున్నారు. కానీ నియోజకవర్గ ప్రజల ఆశలు గల్లంతు అయ్యాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఏడాదిన్నర దాటిన నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదట. ఎన్నికల సమయంలో ప్రధాన హామీగా నియోజకవర్గ యువత కోసం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని గుర్తుర్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు భూమి పూజ చేసి వదిలేశారు. ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం తప్ప ఎలాంటి పవర్స్ లేవు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతుంది.
ఎమ్మెల్యేపై అత్త పెత్తనం
పాలకుర్తి నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా అత్త ఝాన్సీరెడ్డి పెత్తనం కొనసాగుతుందని నియోజకవర్గంలో టాక్. యశస్విని రెడ్డి పేరుకే ఎమ్మెల్యేనట. నిర్ణయాధికారాలు అత్త ఝాన్సీ రెడ్డివేనని పార్టీ నేతలే చెవుళ్లు కొరుక్కుంటున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధిపై నిర్ణయం తీసుకొని ప్రజలకు హామీ ఇచ్చే అధికారం కూడా ఎమ్మెల్యేకు లేదట. ఏం చేయాలన్నా ఝాన్సీరెడ్డి సూచనలు, సలహాల మేరకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వ్యవహరించాల్సి ఉంటుందట. నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేకు చెప్పుకోవాల్సిన సమస్యలను ముందు అత్తకు చెప్పాలట. అత్త ఒకే అంటేనే సమస్యల పరిష్కారం లేదంటే అంటే సంగతులని సమాచారం. ప్రజలు ఎమ్మెల్యే పరిస్థితిని అర్థం చేసుకొని. పార్టీ నియోజకవర్గ ఇంచార్జి, అత్త ఝాన్సీ రెడ్డి వద్దకు వెళ్లినా చేద్దాంలే... చూద్దాంలే అన్న విధంగా వ్యవహరిస్తున్నట్టు పెదవి విరుస్తున్నారు. అధికారులు సైతం అత్తను కలవాల్సిందేనట. సూటిగా చెప్పాలంటే అత్తకు ఇచ్చిన గౌరవం ఎమ్మెల్యేకు ఇచ్చే పరిస్టితి లేదని ఠాంఠాం నడుస్తోంది.
పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి...
ఎమ్మెల్యే అత్త ఝాన్సీ రెడ్డి తీరుతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా ఉన్న దయాకర్ రావు ఓటమికి కష్టపడితే ఓడ ఎక్కేదాక ఓడ మల్లన్న... ఓడ దిగాక బోడ మల్లన్న అన్నట్టు తమ పరిస్థితి మారిందని కార్యకర్తలు, నేతలు ఆగ్రహంతో రగిలి పోతున్నారు. ఝాన్సీరెడ్డి నియోజకవర్గ ఇంఛార్జిగా ఉండి పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే విధంగా కార్యకర్తలతో సమావేశాలు పెట్టడంలేదని ఆరోపణలు లేకపోలేదు.
ముఖ్య నేతలు దూరం...
ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాటి నుంచి యశస్విని రెడ్డి విజయంలో కీలకంగా వ్యవహరించిన ముఖ్యనేతలు పార్టీకి ఆమెకు దూరంగా ఉంటున్నారు. ఝాన్సీరెడ్డి సమీప బంధువు, తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి ఆమె రాజకీయ రంగప్రవేశం, యశస్విని రెడ్డి విజయంలో కీలక వ్యక్తిగా నియోజకవర్గంలో అన్ని తానై చూసుకున్నారు. ఝాన్సీ రెడ్డి తీరు సరిగా లేదని మంచిది కాదని చెప్పిందుకు ఆయన్ని దూరం పెట్టారట. ఎన్నికల టైంలో తిరుపతి రెడ్డికి ఇచ్చిన కారు లాక్కున్నారట.
మరో కీలక నేత కక్కిరాల హరిప్రసాద్ సైతం ఝాన్సీరెడ్డికి, పార్టీకి దూరమయ్యారు. పాలకుర్తి నియోజకవర్గంలో కీలకంగా ఉన్న హరిప్రసాద్ దూరం కావడంతో కార్యకర్తల్లో నిరాశ నెలకొంది. హరిప్రసాద్‌నే పక్కనపెట్టిన ఝాన్సీరెడ్డి మనల్ని పక్కపేట్డదని గ్యారెంటీ ఏంటని నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
శ్రీనివాస్ రెడ్డి సైతం ఝాన్సీ రెడ్డి తీరుతో కాంగ్రెస్‌ను వీడి బీఅర్‌ఎస్‌లో చేరారు. నామినేటెడ్ పోస్టుల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలకు కాకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలతోపాటు కాంగ్రెస్ పార్టీలో అంటిముట్టనట్టుగా ఉన్న నేతలకు కట్టబెట్టారని ఝాన్సీరెడ్డి పై తీవ్ర వ్యతిరేకత ఉంది.
ఎమ్మెల్యే కంటే అత్త పీఏకే పలుకుబడి..!
షాడో ఎమ్మెల్యేకు షాడోగా ఉన్న పీఏ విజేందర్ రెడ్డి ఏది చెబితే అదే ఝాన్సీరెడ్డి ఫాలో అవుతున్నారనే రూమర్ ఉంది. పాలకుర్తి నియోజకవర్గంతోపాటు జిల్లాలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కంటే ఝాన్సీరెడ్డి పిఎ విజేందర్ రెడ్డి మాట చెలామనవుతుంది. ఝాన్సీ రెడ్డి సైతం ఎమ్మెల్యే కంటే పీఏకే ఎక్కువ ఫ్రీడం ఇచ్చారని సమాచారం. నియోజకవర్గ సమస్యలు, పనులపై ఝాన్సీ రెడ్డి ఆమె పీఏ విజేందర్ రెడ్డి చర్చిస్తారని టాక్. ఝాన్సీ రెడ్డి ఎవరితో మాట్లాడాలన్న, అధికారి ఆమె కలవాలన్న పీఏనే నిర్ణయిస్తారని బోగట్టా. పార్టీకి, ఝాన్సీరెడ్డికి నేతలు దూరం కావడంలో పీఏ విజేందర్ రెడ్డి పాత్ర చాలా ఉందని నేతలు, కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటారు. చివరకు ఝాన్సీరెడ్డి ఆమె పీఏ విజేందర్ రెడ్డి నిర్ణయమే ఫైనల్ అని టాక్. పీఏ విజేందర్ రెడ్డి వ్యవహార శైలిపై నేతలు, కార్యకర్తలు ఝాన్సీ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళిన ఆమె పట్టించుకోలేదట. షాడోకు... షాడో ఆమె పీఏ వ్యవహరిస్తారు.
షాడో ఎమ్మెల్యే పై తిరగబడుతున్న ప్రజలు.
ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో సమానంగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఝాన్సీ రెడ్డి గౌరవ మర్యాదలు పొందుతున్నారనే కామెంట్స్ చేస్తున్నారు ప్రజలు. ఝాన్సీరెడ్డికి ఎలాంటి ప్రోటోకాల్ పదవి లేదు అయినా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రెండు రోజుల క్రితం టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు నుంచి పలుమార్లు ఎమ్మెల్యేకు బదులు మీరు రావడం ఏమిటని నిరసనలు ఎదురయ్యాయి. నిన్న నియోజకవర్గం తొర్రూరు మండలంలోని గుదిబండ తండా, వీధులకుంట తండా, పెద్దదుబ్బ తండాల్లో పల్లెబాట కార్యక్రమంలో ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కాదని మీరు రావడం ఏంటని ప్రజలు పలుచోట్ల అడ్డుకోవడం, నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
ప్రోటోకాల్ కోసం పాకులాట..
ఝాన్సీరెడ్డికి కోడలుతో సమానంగా ప్రొటోకాల్ ఉండాలని ఆశ ఉంటుంది. నియోజవర్గంలో ఎలాంటి ఆరోపణలు లేకుండా పెత్తనం చెలాయించవచ్చని కోడలు ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఆమె పౌరసత్వం అడ్డంకిగా మారిందని ప్రచారం జరిగింది. తాజాగా విడుదల చేసిన టిపీసీసీ కమిటీలో ఝాన్సీరెడ్డిని ఉపాధ్యక్షురాలిగా ఎంపిక చేశారు. అమెరికా పౌరసత్వం కలిగి ఉన్న ఝాన్సీరెడ్డి ఇండియా పౌరసత్వాన్ని తీసుకోకుండా డైరెక్ట్‌గా రాజకీయాల్లో వచ్చారు. ఆమెకు ఇప్పటికీ పౌరసత్వం లేదు. ఏది ఏమైనా అనేక ఆరోపణలు, నిరసనలను ఎదుర్కొంటూ పాలకుర్తి షాడో ఎమ్మెల్యే కొనసాగుతున్నారు.





















