కోడి, కోటర్ మేటర్‌పై ఎన్నికల కమిషన్ సీరియస్
TRS Leader Rajanala Srihari: మద్యం, కోడి పంపిణీపై టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరికి ఈసీ నోటీసులిచ్చింది. మద్యం పంపిణీపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
TRS Leader Rajanala Srihari: దసరా సందర్బంగా వరంగల్ లోని హమాలీలకు కోడి, క్వార్టర్ పంచినందుకు టీఆర్ఎస్ నేత మాజీ శాప్ డైరక్టర్ రాజనాల శ్రీహరికి ప్రధాన ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మునుగోడు ఓటర్లకు లిక్కర్ పంపిణీ చేశారు అన్న ఆరోపణలపై ఓ వ్యక్తి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా.. ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై వరంగల్ జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు కోరింది. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులను కలెక్టర్ రాజనాల శ్రీహరికి అందజేశారు. కోడి, క్వార్టర్ పంపిణీపై రెండ్రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రకటన తర్వాత మద్యం పంపిణీ
అక్టోబర్ 5వ తేదీన దసరా సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. తెలంగాణ రాష్ట్ర సమితి - టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితి - బీఆర్ఎస్ గా మార్చిన సంగతి తెలిసిందే. ఇకపై టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా వ్యవహరించనున్నారని, బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు చెప్పిన విషయం విదితమే. అయితే బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉండి రాబోయే ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో ఎంపీ స్థానాల్లో గెలవాలని, కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని రాజనాల శ్రీహరి ఆకాంక్షించారు. బీఆర్ఎస్ కు చంద్రశేఖర్ రావు అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కల్వకుంట్ల తారక రామారావు ఎంపిక కావాలని కోరుకున్నారు. రాష్ట్రానికి కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని, దేశంలో కేసీఆర్ ప్రధానిగా ఉండాలని, కేసీఆర్ కుటుంబానికి విజయాలను సాధించి పెట్టాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 200 మంది హమాలీ కార్మికులకు ఒక్కొక్కరికి ఒక కోడి, ఒక క్వార్టర్ బాటిల్ చొప్పున పంపిణీ చేశారు.
చర్చకు దారి తీసిన మద్యం పంపిణీ
రాజనాల శ్రీహరి చేపట్టిన ఈ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. బహిరంగం మద్యం పంపిణీ చేయడంపై అన్ని పార్టీల నాయకుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే మరి కొందరు మాత్రం రాజనాల శ్రీహరి తాను వార్తల్లో నిలిచేందుకు ఇలాంటి కార్యక్రమం చేపట్టారని విమర్శలు వచ్చాయి. సొంత పార్టీకి చెందిన నాయకుల హస్తం ఉందని, వారే ఈసీకి ఫిర్యాదు చేశారన్న విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు దిల్లీలో కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. వసంత్ విహార్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. నిర్మాణ పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజినీర్లను పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. నిన్న సుమారు 40 నిమిషాలపాటు కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశంలో అన్ని అంశాలను పరిశీలించి పనుల్లో వేగం పెంచాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్, దామోదర రావు, వద్ది రాజు రవిచంద్ర ఉన్నారు.