Edible Oil Scam: వరంగల్‌లో సగం ధరకే వంట నూనె విక్రయం - ఎగబడ్డ జనం!
Edible Oil Scam: వరంగల్ జిల్లా పలువురు కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. సగం ధరకే నూనె డబ్బాలు ఇస్తామంటూ అందులో నీళ్లు నింపి అమ్మేస్తున్నారు. అది తెరిచి చూసిన ప్రజలు షాకవుతున్నారు.
Edible Oil Scam: వరంగల్ జిల్లా రంగశాయిపేటలో కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. సంక్రాంతి పండుగను ఆసరాగా చేసుకొని.. సగం ధరకే నూనె డబ్బాలు ఇస్తామంటూ తెగ దోచేస్తున్నారు. అందులో నూనెకు బదులుగా నీళ్లు నింపి.. 2500 రూపాయవ నూనె డబ్బాను 16 వందలకే ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. తక్కువ ధరకు రావడంతో పెద్ద ఎత్తున ప్రజలు వాటిని కొనుగోలు చేస్తున్నారు. తీరా ఇంటికెళ్లి వాటిని తెరిచి చూసి షాకవుతున్నారు. మోసపోయామంటూ ఎక్కడ ఆ నూనె డబ్బాలను కొనుగోలు చేశారో అక్కడికి వెళ్లి గొడవ పడుతున్నారు. కల్తీ అంటే ఉన్న వాటిలో ఏదేదో కలపడం మనకు తెలిసిన విషయమే. కానీ పూర్తిగా నీళ్లు నింపి నూనెగా అమ్మడం మాత్రం అందరిలోనూ ఆశ్చర్యాన్ని కల్పిస్తోంది.
సంక్రాంతి పండగే వీరి టార్గెట్..
గత మూడు నాలుగు సంవత్సరాలుగా రకరకాల కారణాల వల్ల మంట నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో స్థానికంగా అమ్ముకునే వ్యాపారులకు నిత్యవసర వస్తువు అయిన నూనెపై పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. అలాగే సంక్రాంతి పండుగ రావడం.. ఈ సమయంలో అందరూ పిండి వంటలు చేసుకోవడంతో... దీన్ని అలుసుగా తీసుకున్న కొందరు అక్రమార్కులు స్థానికంగానే కల్తీ నూనె తయారు చేయడం ద్వారా లాభాలను అర్జించొచ్చని ప్రణాళిక వేశారు. ఎలాగూ డిమాండ్ ఉంటుంది కాబట్టి పెద్ద మొత్తంలోనే తయారు చేయాలని నిర్ణయించుకొని ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు.
గతేడాది అక్టోబర్ నెలలో కరీంనగర్ లోనూ కల్తీ నూనె తయారీ
కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా వంట నూనెలు, ఆహార పదార్థాలు కల్తీ చేసి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి బుధవారం నాడు సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలోగల విష్ణు ఇండస్ట్రీస్ కు చెందిన కావేరి ఆయిల్ మిల్ పై ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో అనేక అతిక్రమణలను గమనించడం జరిగింది. పర్మిషన్ తీసుకున్నటువంటి కుకింగ్ ఆయిల్ పేరు మీద కల్తీ నూనెను ప్యాకింగ్ చేసి అమ్ముచున్నారు, సన్ ఫ్లవర్ పేరుతో నూనెను ప్యాక్ చేసి అమ్ముతున్నారు. కానీ సన్ ఫ్లవర్ నూనెను పెద్ద మొత్తంలో తీసుకువచ్చినటువంటి సాక్ష్యాలు లేవు అని, నిబంధనలకు విరుద్ధంగా ప్యాక్ చేసినటువంటి ప్యాకుల నుంచి నుంచి పది శాంపిల్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారితో సేకరించడం జరిగిందని తెలిపారు.
కల్తీ జరిగినట్టుగా అనుమానిస్తున్న కావేరి బ్రాండ్ పేరిట ఉన్న సన్ ఫ్లవర్, వెజిటేబుల్ కుకింగ్ లేబులింగ్ ఉన్న సుమారు 2,500 లీటర్ల వంట నూనెను సీజ్ చేయడం జరిగింది. ల్యాబ్ రిపోర్ట్స్ అనుసరించి విష్ణు ఇండస్ట్రీస్, కావేరి ఆయిల్ మిల్ ఓనర్ అయిన కరుణాకర్ అతని పార్ట్నర్ శ్రీనివాసులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.ఈ దాడిలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు జి. వెంకటేశ్వర్లు, బి సంతోష్ కుమార్, ఎస్ఐలు చేరాలు, సైదాపూర్ ఎస్సై ఆరోగ్యం, ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఆహార పదార్థాలు, నూనెలు నిబంధనలకు విరుద్ధంగా తయారు చేసి కల్తీ చేసి విక్రయించి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించిన వారు ఎంతటి వారైన, వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అంతేకాకుండా పీడీ ఆక్ట్ నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ హెచ్చరించారు.