Draupadi Murmu TS Tour: రామప్పలో రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి!
Draupadi Murmu TS Tour: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ క్రమంలోనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య తెలిపారు.
Draupadi Murmu TS Tour: యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సందర్శనకు విచ్చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రానున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య చెప్పారు. జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, ఏఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకేన్, అదనపు కలెక్టర్ వైవి గణేష్‌తో కలిసి రామప్పలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి పర్యటనకు రామప్ప దేవాలయం సుందరీకరణతో అలంకరణ పూర్తి చేసామని పేర్కొన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రాష్ట్రపతి పర్యటన ఉంటుందని.. ఈ క్రమంలోనే బార్కెట్లు, పార్కింగ్ ఏరియా వంటి వివరాలు వెల్లడించారు.
ప్రసాద్ స్కీమ్ పైలెట్ ప్రాజెక్టు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ స్కీం పైలెట్ ప్రాజెక్టు రామప్పలో రాష్ట్రపతి ప్రారంభించనున్నారని వివరించారు. ఈనెల 28న రాష్ట్రపతి రామప్ప రానుండగా.. ములుగు గిరిజన జిల్లా అయినందున ఆదివాసీ కళాబృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏర్పాట్లలో నిమగ్నమైన అన్ని శాఖల అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ఇప్పటి వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన వివరాలు చెప్పారు. రామప్ప గార్డెన్ అందంగా తీర్చిదిద్దినట్లు, తాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రామప్ప ప్రాంగణం అంతా శానిటైజ చేశామన్నారు. కీటకాలు ప్రవేశించకుండా బ్లీచింగ్ కూడా చేసినట్లు కలెక్టర్ వివరించారు. భద్రతా చర్యల్లో భాగంగా రామప్ప పరిసర ప్రాంతాలన్నింటిలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
రామప్ప పరిసరాల్లో నిషేధాజ్ఞలు..
రామప్ప పరిసర ప్రాంతాల్లో నిషేధ ఆజ్ఞలు జారీ చేశారు. ఆలయం ప్రతీ భాగాన్ని పర్యవేక్షించారు. రాష్ట్రపతి పర్యటనలో భద్రత ఏర్పాట్లకు ప్రజలు.. పోలీసులకు సహకరించాలని కలెక్టర్ కోరారు. రామప్పలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రపతి పర్యటన విజయవంతం చేయనున్నామని తెలిపారు. మూడు ఎలిప్యాడ్ లు ల్యాండ్ అయ్యే విధంగా స్థలం ఏర్పాట్లు పూర్తి అయినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఆ స్థలాలను కూడా పరిశీలించి తనిఖీలు నిర్వహించారు. కలెక్టర్ వెంట డీఆర్ఓకే రమా దేవి, డీపీఓకే వెంకయ్య, పంచాయతి రాజ్ ఈఈ రవీందర్, ఆర్ అండ్ బి ఈఈ వెంకటేష్, డీఈ ఇరిగేషన్ వెంకట కృష్ణారావుకు, పాలంపేట సర్పంచ్ డోలి రజిత శ్రీనివాస్ సంబంధిత శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.
నిన్నే శ్రీశైలం సందర్శన
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం (డిసెంబరు 26) శ్రీశైల మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రశాద్ ప్రోగ్రామ్ కింద శ్రీశైలం ఆలయ అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించారు. తర్వాత శివాజీ స్మారక కేంద్రాన్ని సందర్శించారు. సాయంత్రం 4.15 గంటలకు శ్రీశైలం నుంచి హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్నారు.
శ్రీశైలం పర్యటన నేపథ్యంలో ఉదయం 11.45 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం బయలుదేరి వెళ్లారు. సున్నిపెంట హెలిప్యాడ్ నుండి కాన్వాయ్ లో శ్రీశైలం అతిథి గృహానికి రాష్ట్రపతి చేరుకున్నారు. శ్రీశైల క్షేత్రంలో రు.43.08 కోట్లతో ప్రశాద్ స్కీం కింద వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం చేశారు.