Warangal News: గుడ్‌న్యూస్! తెలంగాణలో మరో ఎయిర్ పోర్టుకు ముందడుగు - రేవంత్ రెడ్డి రివ్యూ
CM Revanth Reddy: వరంగల్ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Warangal Airport: దశాబ్దాలుగా వరంగల్ వాసులు ఆశగా ఎదురు చూస్తున్న కల నెరవేరనుంది. వరంగల్ విమానాశ్రయం (Warangal Airport) నిర్మాణానికి ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన తరవాత వరంగల్ విమానాశ్రయం వ్యవహారాలపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధికారులతో సమీక్షించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వరంగల్ ప్రాంతీయ విమానాశ్రయం విషయంలో కొంతకాలంగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (Airports Authority of India) సైలెంట్‌గా ఉంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో మాట్లాడుతూ.. వరంగల్ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. దీంతో ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై ఏఏఐ అధికారుల్లో కదలిక వచ్చింది.
త్వరలోనే వరంగల్‌కు అధికారుల బృందం
ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై సమీక్షించేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల బృందం త్వరలో రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది. వరంగల్‌లో ప్రస్తుతం ఎయిర్ స్ట్రిప్‌ను పరిశీలించి, ఉన్నతాధికారులతో చర్చలు నిర్వహించనున్నట్లు సమాచారం. అప్పుడు ఎయిర్ పోర్టును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమా? లేక మునుపటి ప్రభుత్వం నిర్ణయం ప్రకారం దశల వారీగా అభివృద్ధి చేస్తారా అనేది తేలనుంది.
గతంలో అదనంగా 253 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
వరంగల్ ఎయిర్‌పోర్ట్స్ నిర్మాణానికి 706 ఎకరాల భూమిని కేటాయించారు. దానికి అదనంగా మరో 253 ఎకరాలు కేటాయిస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌కు ముందు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు హైదరాబాద్ జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం నుంచి వచ్చిన భూమి కేటాయింపు ఉత్తర్వులతో ఏఏఐ అధికారులు వరంగల్‌లో పర్యటించారు. విమానాశ్రయం నిర్మాణం, అక్కడి పరిస్థితులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. దాని తరువాత ఏఏఐ అధికారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై అయోమయం నెలకొంది. విమానాశ్రయ నిర్మాణం కోసం పరిశీలన చేశారా? లేక మరేదైనా కారణాలతో సర్వే చేశారా? అనే విషయంపై ప్రస్తుత ప్రభుత్వానికి స్పష్టత రావాల్సి ఉంది.
ఖర్చు పెట్టేందుకు ఆసక్తి చూపని గత ప్రభుత్వం
వరంగల్ విమానాశ్రయాన్ని దశల వారీగా విస్తరించాలని గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఏటీఆర్ స్థాయి చిన్న విమానాల రాకపోకలు సాగించేలా ఎయిర్‌పోర్ట్ నిర్మించాలనుకున్నారు. ఇందు కోసం 253 ఎకరాలను కేటాయించింది. అయితే ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కనీసం 400 ఎకరాలు కావాలని ఏఏఐ అధికారులు తమ నివేదికలో వెల్లడించారు. అలాగే విస్తరణకు సుమారు రూ.1,200 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే అంత మొత్తాన్ని ఖర్చు చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ సమయంలో ఆసక్తి చూపలేదని ఏఏఐ అధికారులు తెలిపారు.
క్లారిటీ ఎప్పుడు వస్తుందో?
అయితే వరంగల్ విమానాశ్రయంలో రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్లతో విమానాల రాకపోకలకు ఏర్పాట్లు చేయాలని, ఇందుకు అణుగుణంగా ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సూచించింది. కానీ దానిని నిపుణులు వ్యతిరేకించారు. ఒకేసారి నిర్మాణాన్ని చేపడితే అన్ని రకాలుగా ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు. అంతలోనే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఆ విషయం కాస్తా అటకెక్కింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించడంతో ఎయిర్ పోర్ట్ నిర్మాణం అంశం తెరపైకి వచ్చింది. విమానాశ్రయ నిర్మాణానికి రేవంత్ సర్కార్ సుముఖత వ్యక్తం చేసినా అది ఏ స్థాయిలో ఉంటుందో తెలియాల్సి ఉంది.