Congress Politics: ఆస్తి గొడవలతో బీఆర్ఎస్ గల్లంతు, 90 సీట్లతో మళ్లీ అధికారంలోకి కాంగ్రెస్: మహేష్ కుమార్ గౌడ్
Telangana News | కాంగ్రెస్ పార్టీ 90 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తుందన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. వచ్చే ఎన్నికల నాటికి బిఆర్ఎస్ పార్టీ కనపడదు అన్నారు.

ఖమ్మం: వచ్చే ఎన్నికల్లో 90 సీట్లతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని టపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో ఆస్తి గొడవలు జరుగుతున్నాయి, వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో ఆ పార్టీ కనిపించదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. గిరిజన తండాలను గుర్తించిన తొలి నేత ఇందిరా గాంధీ. ఆదివాసుల అభివృద్ధి కోసం ల్యాండ్ సీలింగ్ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టానికి జీవం పోసిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుదే అన్నారు.
ఆదివాసీలను నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం
‘కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల కోసం ప్రత్యేక చట్ట సవరణలు చేసింది. కానీ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. పోడు భూముల కోసం పోరాడిన గిరిజనులపై కేసులు పెట్టింది బిఆర్ఎస్ ప్రభుత్వం. ఆర్‌ఓఎఫ్‌ఆర్ చట్టం కింద 6.69 లక్షల ఎకరాలకు హక్కులు కల్పించింది కాంగ్రెస్. ప్రభుత్వం చేపట్టిన ఇందిర సౌర గిరి జల వికాసం పథకంతో గిరిజనుల జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైందన్నారు. గిరిజనులకు పిసిసిలో సముచిత ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేస్తాను.
వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ గల్లంతు
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు నుంచి సన్న బియ్యం వరకు కాంగ్రెస్ సంక్షేమ పథకాలు కొనసాగిస్తోంది. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు కుల గణన (Caste Census) సర్వే పూర్తి చేసిన ఘనత సీఎం రేవంత్, మంత్రులదే. జల్-జమీన్-జంగల్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లిన ఏకైక పార్టీ కాంగ్రెస్. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో బీజేపీకి చోటు లేదు .. రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ ఆ పార్టీని ఆదరించరు. తెలంగాణలో 90 సీట్లతో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. బిఆర్ఎస్ లో ఆస్తుల కోసం కొట్లాటలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి బిఆర్ఎస్ పార్టీ కనపడదు’ అని మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
*






















