Warangal News:కాకతీయ యూనివర్సిటీలో కొత్త సమస్య- విద్యార్థులకు నిద్రలేకుండా చేస్తున్న ఎలుకలు
Warangal News: వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఎలుకల సంచారం కలకలం సృష్టిస్తోంది. ఎలుకలు విపరీతంగా పెరిగిపోయి హాస్టల్ లో ఉన్న విద్యార్థినులను కొరకడంతో ఆందోళన చేస్తున్నారు.
Warangal News: వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో మూషికాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మహిళా హాస్టళ్లలో నిద్రించిన విద్యార్థుల కాళ్లు, చేతులు కొరకడంతో గాయాలు అయ్యాయి. మహిళల వసతి గృహాల్లో ఈ ఘటన జరిగింది. ఎలుకలు కొరకడంతోనే గాయాలు అయ్యాయని తెలిసి వణికిపోయారు. ఈ మేరకు వర్సిటీలోని పద్మాక్షి హాస్టల్ 'డీ' బ్లాక్ లోని రూం నంబరు-1లో ఇద్దరు విద్యార్థినులకు తీవ్ర గాయాలు అయ్యాయి. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చికిత్స కోసం బాధిత విద్యార్థినులు హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. ఘటన జరిగిన గదిలో పారిశుధ్యం లోపించిందని. పనికి రాని వస్తువులన్నీ నిల్వ ఉంచారని.. ఫలితంగానే ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయని విద్యార్ధినులు చెప్పారు. ఎలుకలతో తాము అనేక ఇబ్బంది పడుతున్నామంటూ ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా హాస్టల్ వార్డెన్ పట్టించుకోలేదని వాపోయారు.
ఈ క్రమంలోనే ఎలుకల సమస్యను తీర్చాలంటూ విద్యార్థినులు ఆందోళన నిర్వహించారు. సమస్యను పరిష్కరించే వరకు తాము అక్కడ ఉండబోమని వెల్లడించారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని తమ సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే వరంగల్ ఎంజీఎంలో ఎలుకల ఘటన మరవక ముందే కాకతీయ యూనివర్సిటీలోనూ మూషికాల సంచారం కలవరపెడుతోంది. గర్ల్స్ హాస్టళ్లలో పెద్ద సంఖ్యలో ఎలుకలు సంచరిస్తున్నా.. సంబంధిత అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. మరి ఇప్పటికైనా పట్టించుకొని విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తారో లేదో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.
గతేడాది ఇదే నెలలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల బీభత్సం
అనారోగ్యంతో ఉన్న రోగులకు భరోసా కల్పించడంలో ఎంజీఎం(MGM) అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో వచ్చిన వ్యక్తిని ఐసీయూ(ICU)లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన్ని ఎలుకలు కొరకడంతో తీవ్ర రక్తస్రావమై ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయాడు. వరంగల్‌లోని భీమరానికి చెందిన శ్రీనివాస్ కిడ్నీ సంబంధిత వ్యాధితో గతేడాది మార్చి నెల 26 వ తేదీ సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. 27వ తేదీ ఉదయం లేచి చూసేసరికి శ్రీనివాస్ వేలును ఎలుకలు కొరికాయి. విషయాన్ని సిబ్బందికి చెప్పాడు. వెంటనే వాళ్లు చికిత్స చేశారు. మళ్లీ ఈ ఉదయం (గురువారం) సుమారు మూడు గంటల ప్రాంతంలో ఎలుకలు శ్రీనివాస్ కాళ్లను తీవ్రంగా కొరికాయి. విపరీతమైన రక్తస్రావం జరిగింది. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాస్ ఎలకల దాడితో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
వైద్య సిబ్బందిపై ఫైర్ అయిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులు
ఎంజీఎం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం పై శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఐసీయూలో రోగిపై ఎలుకల దాడి పై స్పందించిన ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు శానిటేషన్ కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేశామని పక్కనే కిచెన్ ఉండడంతో ఎలుకల బెడద ఉందని చెప్పారు. పాత బిల్డింగ్ కూడా దీనికి ప్రధాన సమస్య అని మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు డాక్టర్ శ్రీనివాసరావు.