Vikarabad Murder Case: శిరీషను చంపిన వ్యక్తి ఇతనే, కనిపెట్టేసిన పోలీసులు - వివరాలు వెల్లడించిన ఎస్పీ
యువతిని శారీరకంగా అనుభవించాలనే ఉద్దేశం అతనికి ఉందని పోలీసులు చెప్పారు.
వికారాబాద్ జిల్లాలో సంచలనం రేపిన నర్సింగ్ విద్యార్థిని శిరీష హత్య కేసును పోలీసులు చేధించారు. ఎట్టకేలకు నిందితుడిని కనిపెట్టేశారు. 19 ఏళ్ల యువతి శిరీషను దారుణంగా హత్య చేసిన వ్యక్తి ఆమె బావ అనిల్ అని పోలీసులు నిర్ధారించారు. యువతిని శారీరకంగా అనుభవించాలనే ఉద్దేశం అతనికి ఉందని పోలీసులు చెప్పారు. అందుకు యువతి ఒప్పుకోకపోవడం వల్లే ఆమెను చంపేసినట్లుగా వికారాబాద్ ఎస్పీ తెలిపారు. శిరీష కేసు వివరాలను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘‘యువతి శిరీషను శారీరకంగా అనుభవించాలని, ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలని ఆమె బావ అనిల్‌కు ఆలోచన ఉంది. అతను చెప్పిన దానికి శిరీష ఒప్పుకోలేదు. శిరీష తరచూ ఫోన్‌లో మరో వ్యక్తితో ఛాటింగ్ చేస్తుండడం, మాట్లాడుతుండడం గమనించిన అనిల్ శిరీషపై కక్ష పెంచుకున్నాడు. ఈ విషయంలో శిరీష తండ్రి, సోదరుడితో అనిల్‌కు మధ్య గొడవ కూడా జరిగింది. కొన్నిసార్లు అనిల్ ఆమెపై దాడి కూడా చేశాడు. హత్యకు ముందు రోజు సాయంత్రం అనిల్ కొట్టడంతో శిరీష ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. శిరీష వెనకే ఆమెను ఫాలో అవుతూ అనిల్ ఆమెతో గొడపడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న నిందితుడు బీరు సీసాతో దాడి చేసి నీటి కుంటలో ముంచి హత మార్చాడు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణ చేయిస్తామని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
అసలు ఏం జరిగిందంటే?
నర్సింగ్ చదివే ఓ విద్యార్థిని హత్యకు గురైంది. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటు వెళ్లిన ఆమె ఆదివారం ఉదయం నీటి కుంటలో శవమై తేలింది. అయితే ఆమె మృతదేహంపై రక్తపు మరకలు ఉండడంతో హత్య చేసినట్లు పోలీసులు భావించారు.
ఈ నెల 11న శిరీష హత్యకు గురై ఊరి బయట శవంగా కనిపించింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల శిరీష శనివారం రోజు రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతసేపవుతున్నా ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. తెలిసిన స్నేహితులు, బంధువులు అందరికీ ఫోన్ లు చేశారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఆదివారం (జూన్ 11) రోజు ఉదయం గ్రామ సమీపంలోని నీటి కుంటలో శిరీష శవమై తేలింది. విషయం గుర్తించిన స్థానికులు.. కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలిపారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే శిరీష మృతదేహంపై రక్తపు మరకలు ఉండడంతో ఆమెను ఎవరో హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎస్సై విఠల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముందుగా హత్య చేసి ఆ తర్వాతే మృతదేహాన్ని కుంటలో పడేసినట్లు పోలీసులు చెబుతున్నారు. శిరీష ఇంటర్మీడియట్ పూర్తి చేసి వికారాబాద్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో నర్సింగ్ శిక్షణ తీసుకుంటోంది. అయితే ఈమెను ఎవరు, ఎప్పుడు, ఎలా చంపారో త్వరలోనే తేలుస్తామని పోలీసులు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.