Kishan Reddy: ఏపీలో అందుకే హింసలు, ఘర్షణలు! అక్కడ NDA సర్కార్ పక్కా - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
AP Latest News: ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపర్చేలా ఉంటాయని అన్నారు.
Kishan Reddy on AP Elections: ఆంధ్రప్రదేశ్ లో 100 శాతం కూటమిదే విజయం అని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. అక్కడ కచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం నెలకొల్పుతుందని చెప్పారు. ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపర్చేలా ఉంటాయని అన్నారు.
ఎన్నికల తర్వాత ఏపీలో జరుగుతున్న అల్లర్లపై కిషన్ రెడ్డి స్పందిస్తూ.. కారకులపై కేంద్ర ఎన్నికల కమిషన్, ఏపీ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఏపీలో ఎన్నికలపై అధికార పార్టీకి నిరాశ, నిస్పృహలు ఉండొచ్చని అన్నారు. అందుకే అల్లర్లు జరుగుతూ ఉన్నాయని అన్నారు. ప్రజల్లో మార్పు రావడంతోనే అభ్యర్థులు గొడవకు దిగారని అభిప్రాయపడ్డారు.
ఇక తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని.. ఫలితాలు బీజేపీకే అనుకూలంగా వస్తాయని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలు ఎవరూ కాంగ్రెస్ చెప్పిన అనవసర హామీలను నమ్మలేదని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లను తీసివేస్తుందని కాంగ్రెస్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయాన్ని ప్రజలు నమ్మలేదని చెప్పారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదని.. ఇచ్చిన అన్ని హామీలనూ ప్రభుత్వం విస్మరించిందని కిషన్ రెడ్డి అన్నారు.
‘‘రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీఆర్ఎస్ దుష్ప్రచారం చేశాయి. అయినా ఈ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బీజేపీనే నమ్మి ఓట్లేశారు. రాష్ట్రంలో అధిక ఎంపీ సీట్లు సాధిస్తాం. తెలంగాణలో మహాలక్ష్మి ఫ్రీ బస్సు పథకం ఒకటి మాత్రమే అమలు అవుతోంది. ఆ పథకం సజావుగా నడిచేందుకు ఆర్టీసీకి అవసరమైన నిధులను ప్రభుత్వం సకాలంలో చెల్లించడమే లేదు. మహిళలకు రూ.2 వేలు ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి, రైతు కూలీలకు రూ.12 వేలు, తులం బంగారం కూడా హామీలు ఇచ్చారు. వాటి ఊసే ఇంత వరకూ లేదు. 420 హామీలు రేవంత్ రెడ్డి ఇచ్చారు. ముందు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలి. ప్రజలు జూన్ 4న ఇచ్చే ఫలితం ఏ రకంగా ఉండబోతుందో మీరే చూస్తారు’’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.