Ugadi 2023: ఉగాది అంటే అందరికీ పచ్చడి, పంచాంగం: వాళ్లకు మాత్రం అలా కాదు!
ఉగాది అనగానే గుమ్మానికి మామిడాకుల తోరణాలు! వంటింట్లో పులిహోర భక్ష్యాలు! షడ్రుచుల కలబోతగా పచ్చడి ఆరగింపులు! కోయిల కూతల నడుమ కోవెలలో పంచాంగ శ్రవణాలు!
ఉగాది అనగానే గుమ్మానికి మామిడాకుల తోరణాలు! వంటింట్లో పులిహోర భక్ష్యాలు! షడ్రుచుల కలబోతగా పచ్చడి ఆరగింపులు! కోయిల కూతల నడుమ కోవెలలో పంచాంగ శ్రవణాలు! ఆదాయ వ్యయాలు, అవమాన, రాజ్యపూజ్యాల బేరీజులు! ఆ రోజు అలా గడిచిపోతుంది అందరికీ! కానీ వాళ్లకు మాత్రం ఉగాది అంటే, కేవలం పచ్చడి మాత్రమే కాదు. పంచాగంతోనే సరిపెట్టుకోరు! మరేం చేస్తారు? మీరే చదవండి!
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు! ఓ మోస్తరు మున్సిపాలిటీ! అందరికీ ఉగాది ఒకరకంగా ఉంటే, ఈ ఊరి జనానికి మరోలా వుంటుంది! తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా జరుపుకోవడం ఈ ఊరి ఆచారం! షడ్రురుచుల పచ్చడితో పాటు మందు,మాంసాలు, ముత్యాలమ్మకు బోనాలు, ఎడ్లబండ్ల సవారీ, వాహనాల ప్రదర్శనలు, డప్పుచప్పుళ్లు, కేరింతల నడుమ ఉగాది జరుపుకుంటారు. సుమారు వందేళ్ల నుంచి ఈ సంప్రదాయం ఇక్కడ పొల్లుపోవడం లేదు.
వందేళ్ల క్రితం, ఉగాదికి కొద్దిరోజుల ముందు ఒకసారి ఏమైందంటే.. మోత్కూరు గ్రామ ప్రజలకు అమ్మవారు (మశూచి) సోకింది. జనం పిట్టల్లా రాలిపోయారు. ఏమందూ పనిచేయడం లేదు. గ్రామంలో తూర్పు, పడమర దిక్కుల్లో కొలువై ఉన్న ముత్యాలమ్మ తల్లి ఆగ్రహానికి వచ్చిందని, ఆ కోపం వల్లనే అమ్మవారు సోకి జనం చనిపోతున్నారని ఊరిపెద్దలు భావించారు. దీంతో ఉగాది పర్వదినం రోజున గ్రామమంతా ముత్యాలమ్మకు బోనాలు చేసి, జంతుబలి ఇచ్చి అమ్మవార్లను శాంతింపజేశారు. ఫలితంగా గ్రామంలో ఒక్కసారిగా (మశూచి) మాయమైపోయిందని గ్రామపెద్దలు చెబుతుంటారు. అలా ఆరోజు నుంచి, నేటివరకు మోత్కూరులో ఉగాది వేడుకలు అందరికంటే భిన్నంగా, మందు మాంసాలతో జరుగుతుంటాయి.
ఆనాటి నుంచి నేటి వరకు ఇదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోందిక్కడ. ఉగాది పండుగ రోజున గ్రామస్తులంతా ఊరికి తూర్పు, పడమరన ఉన్న ముత్యాలమ్మ తల్లులకు కోళ్లు, మేకలు బలిస్తారు. అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించి శాక పోస్తారు. ఉగాది ముందురోజు రాత్రి బోనాలు చేస్తారు. రైతులు తమ ఎడ్లబండ్లను, వాహనాలను శుభ్రంగా కడిగి, పుసుపు, కుంకుమ, పూలదండలతో ముస్తాబుచేస్తారు
బోనం కుండలకు పసుపు, కుంకుమ రాసి, వేపమండలతో అలంకరిస్తారు. ఉదయం ప్రజలంతా ఉగాది పచ్చడి చేసుకుని తాగుతారు. మధ్యాహ్నం మందు, మాంసంతో భోజనాలు చేస్తారు. అనంతరం బోనాలు ఎత్తుకుని డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా హైస్కూల్ ఆవరణలోకి వెళతారు. రైతులు తమ ఎడ్లబండ్లను, వాహనాలను, (బైక్ , ఆటో, జీపు, లారీ, ఏది ఉంటే అది) ఓలింగా.. ఓలింగా అంటూ బోనాల చుట్టూ తిప్పుతారు.
ఇక్కడ జరిగే ఉగాది వేడుకలను చూసేందుకు పట్టణప్రజలు బంధుమిత్రులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అధికసంఖ్యలో వస్తుంటారు. ఎడ్లబండ్లు, వాహనాల ప్రదర్శనలు పోటాపోటీగా నిర్వహిస్తారు. యువత బైకులతో విన్యాసాలు చేస్తారు. సుమారు రెండు, మూడు గంటలపాటు ప్రదర్శనలు హోరాహోరీగా జరుగుతాయి.
తర్వాత మహిళలంతా బోనాలతో హైస్కూల్ ఆవరణనుంచి ముత్యాలమ్మ ఆలయాలకు వెళ్లి, అమ్మవార్లకు నైవేద్యం సమర్పిస్తారు. పిల్లాపాపలను, పాడి పంటలను చల్లగా చూడాలంటూ తల్లులను వేడుకుంటారు. అనంతరం ఊరిలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం ఆలకిస్తారు. అక్కడితో వేడుకలు ముగుస్తాయి. మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని జామచెట్లబావి, కొండాపురం, ఆరెగూడెం గ్రామాల ప్రజలు కూడా ఇదే తరహాలో ఉగాదిని జరుపుకుంటారు.