Andhra Politics : సీఎం పదవి ముష్టి అడిగితే రాదు - పవన్‌కు మంత్రుల కౌంటర్ !
సీఎం పదవిపై పవన్ చేసిన వ్యాఖ్యలపై ఇద్దరు ఏపీ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. ప్రజలు పదవులు ఇవ్వాలని.. ముష్టి అడుక్కుంటే రాదని విమర్శించారు.
Andhra Politics : వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలపై మంత్రులు దాడిశెట్టి రాజా, సీదిరి అప్పలరాజు ఘాటు విమర్శలు చేశారు. పవన్ తన నోటికి ఏది తోస్తే అది మాట్లాడుతున్నారని, గంటకో నిర్ణయం, పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. శనివారం వేర్వేరు చోట్ల మీడియాతో మాట్లాడిన మంత్రులు.. పవన్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
చంద్రబాబు మెప్పు కోసం పవన్ తాపత్రయ పడుతున్నారన్న దాడిశెట్టి రాజా
పవన్ కల్యాణ్ తన యజమాని చంద్రబాబు మెప్పు కోసం తాపత్రయపడుతున్నారని మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ పెట్టిన రెండు మీటింగ్‌లు అట్టర్ ప్లాప్ అయ్యాయని చెప్పారు. ఇండిపెండెంట్‌గా చాలా మంది గెలిచారని, పార్టీ పెట్టి కూడా పవన్ గెలవలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ ఎక్కడ పోటీ చేస్తారో ఆయనకే క్లారిటీ లేదన్నారు. అందుకేపవన్ కళ్యాణ్‌ను ఆ పార్టీ నేతలు మానసిక వైద్యుల దగ్గరికి తీసుకెళ్లాలని సూచించారు.. పవన్ తిరిగేది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో..ఇప్పటికీ రెండు చోట్ల బహిరంగ సభలు పెడితే రెండు చోట్ల ఫెయిల్ అంటూ విమర్శించారు..కనీసం పవన్ సభకు 4 వేల మంది కూడా రావడం లేంటూ ఎద్దేవా చేశారు.
సీఎం పదవి ముష్టి అడిగితే రాదన్న సీదిరి అప్పలరాజు !
ముఖ్యమంత్రి పదవి ప్రజలు ఇవ్వాలి తప్ప, ముష్టి అడిగితే వచ్చేది కాదని మరో మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. తాను అసెంబ్లీకి వెళ్లడానికి ఎవరు ఆపుతారంటూ పవన్ కళ్యాణ్ అంటున్నారని.. ఇంతకీ పవన్ తాను ఎమ్మెల్యేగా గెలిచేందుకు తిరుగుతున్నాడా? లేక తన ఎమ్మెల్యేల్ని గెలిపించేందుకా? అనే క్లారిటీ లేదన్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రశ్నించారు. వారాహి యాత్ర అసంబద్దమైనదని.. చెప్పుల గురించి మాట్లాడుతున్న పవన్.. తన పార్టీ గుర్తు గురించి మాట్లాడాలన్నారు. చెప్పులు మర్చిపొతే తెచ్చుకోవచ్చు కానీ.. పార్టీ గుర్తు పోతే ఎలా? అని ప్రశ్నించారు. ముందు మీ పార్టీ గుర్తు పోయిందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పవన్‌ని సూచించారు. పార్టీ గుర్తు ఎక్కడుండో, ఎలక్షన్ కమీషన్ ఎవరికి కేటాయించిందో తెలుసుకోవాలని చెప్పారు. తనని సీఎం చేయాలని కోరుతున్న పవన్.. ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాడు? అని నిలదీశారు. ముఖ్యమంత్రి కావాలంటే రాష్ట్రం మొత్తం పోటీ చేయాలని, కేవలం 30 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే సీఎం కాలేరని పవన్‌కి కౌంటర్ ఇచ్చారు.
సీఎం పదవిపై పవన్ ఏమన్నారంటే ?
ముఖ్యమంత్రి పదవిపై కూడా పవన్ కల్యాణ్ పిఠాపురంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లుగా తాను ఎప్పుడూ ఈ విషయం చెప్పలేదని, కానీ, ఈసారి చెబుతున్నానని అన్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని పవన్ స్పష్టం చేశారు. ఈ రోజు చెప్తున్నా మీరు సంపూర్ణ అధికారం ఇస్తే సీఎం పదవి చేపడతానని, నేను ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తానని స్పష్టం చేశారు. పిఠాపరంలో కొలువైన శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా చెపుతున్నా ఏపీని దేశంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని, నాకు అధికార పీఠం ఇవ్వండని నేను అర్థిస్తున్నాని పేర్కొన్నారు. తనకు ఎటువంటి భయాలు లేవని, ముఖ్యమంత్రిని సైతం ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నానని, పిచ్చివాగుడు వాగితే, ఇళ్ళలో నుంచి లాక్కొచ్చి కొడతానని, జనసేన ప్రభుత్వం ఏర్పడితే గూండా కొడుకులకు నరకం చూపిస్తాని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా, దత్తాత్రేయుడి సాక్షిగా కోరుతున్నా పిఠాపురం ప్రజలను నాకు ఒక్కసారి అధికారం ఇవ్వండి అంటూ కోరారు. దీనిపైనే వైఎస్ఆర్‌సీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.