TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్‌కు మరోసారి సిట్ నోటీసులు
TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ కు సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని సూచించింది.
TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని రెండోసారి నోటీసులు ఇచ్చారు. ఇటీవలే మొదటిసారి నోటీసులు ఇవ్వగా.. బండి సంజయ్ సిట్ అధికారుల ముందు హాజరు కాలేకపోయారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నందున తాను హాజరు కాలేకపోతున్నానంటూ సిట్ కు లేఖను కూడా రాశారు.
తాను సిట్ ను నమ్మడం లేదని లేఖలో వివరించారు బండి. తన దగ్గర ఉన్న సమాచారాన్ని సిట్ కు ఇవ్వదలుచుకోలేదని వెల్లడించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తనకు నమ్మకం ఉన్న సంస్థలకు మాత్రమే సమాచారం ఇస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు. తనకు సిట్ నోటీసులు అందలేదని... మీడియాలో వచ్చిన సమాచారం మేరకే తాను స్పందిస్తున్నట్లు వివరించారు.శుక్రవారం రోజు సిట్ ముందు బండి సంజయ్ హాజరు కావాల్సి ఉండగా దూరంగా ఉన్నారు. దీంతో మరోసారి బండికి సిట్ నోటీలులు ఇచ్చింది. మరి ఈసారి అయినా ఆయన సిట్ ముందు హాజరవుతారో లేదో చూడాలి.
మంగళవారం మొదటిసారి నోటీసులు జారీ చేసిన సిట్..
ఉద్యోగ పరీక్షల పేపర్ల లీకేజీ కేసుల్లో తనకు నోటీసులు ఇచ్చే ధైర్యం ఉందా అని సిట్ అధికారులపై సోమవారం బండి సంజయ్ చాలెంజ్ చేశారు. మంగళవారం ఆయనకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రశ్నాపత్నాల లీకేజీ విషయంలో బండి సంజయ్ చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని 24వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఇలాంటి ఆరోపణలు చేసిన టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. ఆయనను 23వ తేదీన ఆధారాలు తీసుకుని తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పుడు బండి సంజయ్ వంతు వచ్చింది.